ఓలా స్కూటర్‌లో వచ్చిన మంటలపై సింపుల్ వన్ సీఈఓ ఆసక్తికర ట్వీట్..!

27 Mar, 2022 18:37 IST|Sakshi

పెట్రోల్‌ ధరల నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు కాలుష్యాన్ని తగ్గిస్తుందంటూ చెబుతూ వస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయా? అంటే అవును అనే విధంగా వరుస సంఘటనలు దేశంలో చోటు చేసుకుంటున్నాయి. వేసవి కాలం మొదలైందో లేదో ఒకే రోజు తమిళనాడు, మహారాష్ట్రలలో రెండు చోట్ల ఎలక్ట్రిక్‌ స్కూటర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. పూణే నగరంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓలా ఎలక్ట్రిక్‌ స్కూట​ర్‌ ఎస్‌ 1 ప్రో బైకు అగ్నికి ఆహుతయ్యింది. రోడ్డు పక్కన ఓ షాపు ముందు నిలిపి ఉంచిన స్కూటరు నుంచి ఉన్నట్టుండి పొగలు రావడం మొదలైంది. క్షణాల్లోనే దట్టమైన పొగలు కాస్తా మంటలుగా మారింది. 

నిమిషాల వ్యవధిలోనే ఓలా స్కూటర్‌ అగ్ని కీలల్లో చిక్కుకుని కాలి మసయ్యింది. అక్కడే ఉన్న స్థానికులు ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. దేశ వ్యాప్తంగా ఫుల్‌ క్రేజ్‌ ఉన్న ఓలా స్కూటర్‌ మంటల్లో చిక్కుకుని తగలబడి పోవడం సంచలనంగా మారింది. ఈ స్కూటరులో అమర్చిన లిథియం ఐయాన్‌ బ్యాటరీలో ఎక్సోథెర్మిక్‌ రియాక్షన్ కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపించాలని.. స్కూటరు డిజైనులో లోపాలు ఉంటే వెంటనే సరి చేయాలని ఓలా స్కూటర్‌ యూజర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

అయితే, ఈ సంఘటనపై ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ వాహన తయారీ సంస్థ సింపుల్ వన్ సీఈఓ పరోక్షంగా స్పందించారు. ఈ సంఘటన గురించి ప్రస్తావించకుండా.. వారు తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి తీసుకుంటున్న భద్రతపై సింపుల్ వన్ సీఈఓ సుహాస్ రాజ్ కుమార్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ఏముంది అంటే?.. #SimpleONE ప్రారంభ రోజుల నుంచి థర్మల్ పనితీరుపై మా ప్రధాన దృష్టి ఉంది. అపూర్వమైన పనితీరును పనితీరు పొందడానికి, థర్మల్ సమస్యలు నివారించడానికి, తీవ్రమైన పరిస్థితులలో కూడా ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచడానికి మేము మా స్వంత థర్మల్ మేనేజ్మెంట్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాము. మాకు మీ #SafetyFirst" అని ట్వీట్ చేస్తూ మరోక ట్వీట్‌ను రీ-ట్వీట్ చేశారు.

(చదవండి: రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ ఎఫెక్ట్‌...తల్లిదండ్రులకు షాకింగ్‌ న్యూస్‌..!)

మరిన్ని వార్తలు