యూపీఐ లావాదేవీలు 1,000 కోట్లు 

27 Sep, 2023 01:27 IST|Sakshi

విలువ రూ.15,18,456 కోట్లు 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డిజిటల్‌ పేమెంట్స్‌ రంగంలో దేశవ్యాప్తంగా యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) సరికొత్త రికార్డు నమోదు చేసింది. 2023 ఆగస్ట్‌లో యూపీఐ లావాదేవీల సంఖ్య ఏకంగా 1,000 కోట్ల మార్కును దాటి 1,024.17 కోట్లకు చేరుకుంది. వీటి విలువ రూ.1518456.40 కోట్లు. 2022 ఆగస్ట్‌లో లావాదేవీల సంఖ్య 658.19 కోట్లు కాగా, విలువ రూ.10,73,162 కోట్లు నమోదైంది.

ఈ ఏడాది ఆగస్ట్‌లో వ్యక్తుల నుంచి వ్యక్తులకు 74.79 శాతం వాటాతో రూ.11,79,095.6 కోట్ల విలువైన 438.8 కోట్ల లావాదేవీలు జరిగాయి. అలాగే వ్యక్తుల నుంచి వర్తకులకు 25.21 శాతం వాటాతో రూ.3,97,440.9 కోట్ల విలువైన 619.7 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. క్షణాల్లో చెల్లింపులు జరిపే వీలుండడంతో యూపీఐ యాప్స్‌కు ఊహించనంతగా ఆదరణ పెరుగుతోంది. భారత్‌లో యూపీఐ సేవలను 484 బ్యాంకులు, డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్థలు అందిస్తున్నాయి. యూపీఐ యాప్స్‌లో టాప్‌–5లో వరుసగా ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం, క్రెడ్, యాక్సిస్‌ బ్యాంక్‌ నిలిచాయి.  

చిన్న మొత్తాలే అధికం.. 
పరిమాణం పరంగా వ్యక్తుల నుంచి వర్తకులకు రూ.500 లోపు విలువ చేసే లావాదేవీల సంఖ్య ఏకంగా 84.5 శాతం వాటాతో 523.7 కోట్లు జరిగాయి. రూ.501–2,000 మధ్య 10.8 శాతం వాటాతో 67 కోట్లు, రూ.2,000లపైన 4.67 శాతం వాటాతో 28.9 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. అలాగే వ్యక్తుల నుంచి వ్యక్తులకు రూ.500 లోపు విలువ చేసేవి 55.6 శాతం వాటాతో 244 కోట్లు, రూ.501–2,000 విలువ కలిగినవి 22 శాతం వాటాతో 96.6 కోట్లు, రూ.2,000లపైన విలువైనవి 22.3 శాతం వాటాతో 97.9 కోట్ల లావాదేవీలు రిజిష్టర్‌ అయ్యాయి.

విలువ పరంగా వ్యక్తుల నుంచి వ్యక్తులకు రూ.500 లోపు నమోదైన లావాదేవీల విలువ 3.44 శాతం వాటాతో రూ.40,558 కోట్లు. అలాగే రూ.501–2,000 మధ్య రూ.1,17,782 కోట్లు చేతులు మారాయి. రూ.2,000లపైన జరిగిన లావాదేవీల విలువ 86.57 శాతం వాటాతో రూ.10,20,754.8 కోట్లుగా ఉంది. ఇక వ్యక్తుల నుంచి వర్తకులకు రూ.500 వరకు విలువ చేసే రూ.59,992.7 కోట్ల లావాదేవీలు జరిగాయి. రూ.501–2,000 మధ్య రూ.68,665 కోట్లు, రూ.2,000లపైన రూ.2,68,782.5 కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు