రెండో రోజూ యూఎస్‌ మార్కెట్ల జోరు

29 Sep, 2020 09:16 IST|Sakshi

డోజోన్స్‌ 410- నాస్‌డాక్‌ 204 పాయింట్లు అప్‌

టెస్లా, యాపిల్‌, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, మైక్రోసాఫ్ట్‌ ప్లస్‌

బోయింగ్‌ కంపెనీ, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌ జూమ్‌

వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ వారాంతాన జోరందుకున్న యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లు సోమవారం సైతం లాభపడ్డాయి. డోజోన్స్‌ 410 పాయింట్లు(1.5%) ఎగసి 27,584 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 53 పాయింట్ల(1.6%) బలపడి 3,352 వద్ద  ముగిసింది. నాస్‌డాక్‌ మరింత అధికంగా 204 పాయింట్లు(1.8%) జంప్‌చేసి 11,118 వద్ద స్థిరపడింది. శుక్రవారం సైతం ఇండెక్సులు ఇదే స్థాయిలో పురోగమించిన సంగతి తెలిసిందే. కోవిడ్‌-19తో సవాళ్లు ఎదుర్కొంటున్న నిరుద్యోగులు, కంపెనీలకు అండగా వాషింగ్టన్‌ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్యాకేజీపై నేడు తిరిగి చర్చలు ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. దీంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు తెలియజేశారు.

ఫాంగ్‌ స్టాక్స్‌ అప్‌
ఫాంగ్‌(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే టెక్‌ దిగ్గజాలలో యాపిల్‌, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌,  అల్ఫాబెట్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌ 2.5-0.7 శాతం మధ్య లాభపడగా.. ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ టెస్లా ఇంక్‌ 3.4 శాతం జంప్‌చేసింది. ఇతర కౌంటర్లలో అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ 4 శాతం ఎగసింది. ప్రభుత్వం నుంచి 5.5 బిలియన్‌ డాలర్ల రుణాన్ని పొందడంతో ఈ కౌంటర్‌కు జోష్‌ వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. కొద్ది రోజులుగా నిలిచిపోయిన 737 మ్యాక్స్‌ విమానాలపై అంచనాలతో బోయింగ్ కంపెనీ 6.4 శాతం దూసుకెళ్లింది.  కాగా.. ప్రత్యర్థి కంపెనీ డబ్ల్యూ పీఎక్స్‌ ఎనర్జీని 2.56 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు డెవాన్‌ ఎనర్జీ తాజాగా పేర్కొంది. దీంతో ఈ రెండు కౌంటర్లూ 16-11 శాతం చొప్పున జంప్‌చేశాయి. లండన్‌లో కార్యకలాపాలకు కోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన వార్తలతో ఉబర్‌ టెక్నాలజీస్‌ 3.2 శాతం పుంజుకుంది.

మరిన్ని వార్తలు