బైడెన్‌ భేష్‌.. షిన్‌జియాంగ్‌ కాదు మొత్తం చైనాకే ముడిపెట్టేశాడు

24 Dec, 2021 11:14 IST|Sakshi

Joe Biden Signed Uyghurs Rights Protection Bill To Check China Atrocities: కీలకంగా భావించిన ఉయిగర్‌ చట్టంపై ఎట్టకేలకు అగ్రరాజ్యం అధినేత రాజముద్ర పడింది. చైనాను ఇరకాటంలో పడేసే ‘ఉయిగుర్‌ ఫోర్స్డ్‌ లేబర్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌’(బలవంతపు కార్మిక నిరోధక చట్టం) మీద గురువారం అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేశారు. అనంతరం ఆయన ట్విటర్‌ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  


‘‘ద్వైపాక్షిక ఒప్పందం మీద సంతకం చేశా. కేవలం షిన్‌జియాంగ్‌ మాత్రమే కాదు.. చైనాలోని మిగతా ప్రాంతాలకు కూడా ఇది వర్తిస్తుంది. చైనా ప్రతీ మూల నుంచి వచ్చేవి బలవంతపు చాకిరీ ఉత్పత్తులు కావని నిర్ధారించుకునేందుకు మా వద్ద (అమెరికా ప్రభుత్వం) ఉన్న ప్రతీ సాధనాన్ని ఉపయోగించుకుంటాం’’ అంటూ ఉయిగర్ల చట్టాన్ని బలంగా అమలు చేసే ఉద్దేశాన్ని అధ్యక్షుడు జో బైడెన్‌ ట్విటర్‌ వేదికగా వినిపించారు.

ఇదిలా ఉంటే చైనా పశ్చిమ ప్రాంతంలో పదిలక్షల మైనార్టీ వర్గపు జనాభాపై మానవ హక్కుల ఉల్లంఘన జరగుతోందని,  వెట్టిచాకిరీ చేయించుకుంటోందని చైనా మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  అమెరికా అయితే ఈ వ్యవహారంలో చైనా మీద మొదటి నుంచే కొరడా ఝళిపిస్తోంది. ఈ క్రమంలో  షిన్‌జియాంగ్‌ నుంచి తమ దేశానికి అన్ని దిగుమతులను నిషేధిస్తూ ఓ బిల్లు తీసుకొచ్చింది.  బిల్లుకు సెనేట్‌ గత గురువారమే ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేయగా.. చివరి పేరాలో అభ్యంతరాల మేరకు మరో వారం ఆమోద ముద్ర వాయిదాపడింది. దీంతో ఆ అభ్యంతరాలపై క్లియరెన్స్‌ అనంతరం.. గురువారం (డిసెంబర్‌ 23న) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేయడంతో చట్టం అమలులోకి వచ్చింది.  

Uyghur Forced Labor Prevention Act ప్రకారం..  బలవంతపు చాకిరీ లేకుండానే తయారుచేశామని నిరూపించగలిగిన ఉత్పత్తులను మాత్రమే ఇకపై అమెరికా చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇది నిరూపించుకోవాలంటే షిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లోకి అమెరికా ప్రతినిధుల్ని, అంతర్జాతీయ జర్నలిస్టులు తప్పనిసరిగా అనుమతించాల్సి ఉంటుంది.  అదే జరిగితే అక్కడ జరిగే అకృత్యాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇలా వర్తకవాణిజ్యాన్ని ముడిపెట్టి.. చైనా బండారం బయటపెట్టాలన్నదే బైడెన్‌ ప్రభుత్వం వేసిన స్కెచ్‌.  ఇక్కడో కొసమెరుపు ఏంటంటే.. కేవలం షిన్‌జియాంగ్‌ను మాత్రమే తొలుత చట్టంలో చేర్చిన అమెరికా పార్లమెంట్‌(కాంగ్రెస్‌).. ఆపై మిగతా ప్రావిన్స్‌లకు సైతం ఈ చట్టాన్ని అన్వయింపజేయడం. 

ఇదిలా ఉంటే వర్తకవాణిజ్యాల పరంగా అమెరికాకు వచ్చే వీలైనన్నీ దారులను చైనాకు మూసేస్తోంది బైడెన్‌ ప్రభుత్వం.  బొమ్మలపై విషపు రసాయనాల పూత ఉంటోందని ఆరోపిస్తూ..  మేడ్‌ ఇన్‌ చైనా బొమ్మలను అమెరికాలో అడుగు పెట్టనివ్వట్లేదు. ఇక ఉయిగర్లపై జరుగుతున్న అఘాయిత్యాలను వ్యతిరేకిస్తూ.. ఆ దేశ బయోటెక్‌, నిఘా కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు.. ఇలా ఒక్కోదానిపై ఆంక్షలు విధిస్తూ పోతోంది. ఇక అమెరికా వైపు నుంచి కూడా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతులు పొందకుండా.. చైనాకు ఎలాంటి ఉత్పత్తులను విక్రయించడానికి వీల్లేదని ఆదేశాలు అమలు చేస్తోంది.

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా.. అమెరికాతో వర్తకం ద్వారా భారీ ఆదాయం వెనకేసుకుంటోంది. అయితే కరోనా పరిణామాల అనంతరం ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం బెడిసికొడుతోంది. ఈ క్రమంలో చైనాను దూరం పెడుతూ.. క్రమంగా భారత్‌ సహా ఇతర ఆసియా దేశాలకు దగ్గర అవుతోంది అమెరికా.
 

సంబంధిత వార్త: డ్రాగన్‌కు దెబ్బలు.. షిన్‌జియాంగ్‌ మీదే ఫోకస్‌

మరిన్ని వార్తలు