ఏ వ్యాక్సిన్‌ అయినా 5 రోజుల్లో డెలివరీ

4 Dec, 2020 13:58 IST|Sakshi

అవసరమైతే మైనస్‌ 75 డిగ్రీలలోనూ వ్యాక్సిన్ల రవాణా

ప్రపంచంలోని 220 దేశాలకు సేవలు అందించగలం

ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా 1-5 రోజుల్లోగా సరఫరా

కొరియర్‌ సర్వీసుల కంపెనీ డీహెచ్‌ఎల్‌ ఎక్స్‌ప్రెస్‌ వెల్లడి

న్యూయార్క్‌: కొరియర్‌ సర్వీసుల దిగ్గజం డీహెచ్ఎల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రపంచంలో ఏ దేశానికైనా 1 నుంచి 5 రోజుల్లోగా వ్యాక్సిన్లను అందించగలమంటూ తాజాగా పేర్కొంది. తమ సర్వీసులు విస్తరించిన 220 దేశాలకు కోవిడ్‌-19 వ్యాక్సిన్లను డెలివరీ చేయగలమని తెలియజేసింది. మైనస్‌ 75 డిగ్రీలలోనూ వ్యాక్సిన్ల రవాణాకు సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు విదేశీ మీడియా పేర్కొంది. కొద్ది నెలలుగా ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌.. సెకండ్‌వేవ్‌లో భాగంగా అమెరికా, యూరోపియన్‌ దేశాలలో ఇటీవల భారీగా విస్తరిస్తున్న విషయం విదితమే. దీంతో  ఫైజర్‌ వ్యాక్సిన్‌ వినియోగానికి ఎమర్జెన్సీ ప్రాతిపదికన యూకే ప్రభుత్వం తాజాగా‌ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ వ్యాక్సిన్‌ను -75 సెల్షియస్‌లో నిల్వ చేయవలసి ఉండటంతో డీహెచ్‌ఎల్‌ ఎక్స్‌ప్రెస్‌ సన్నాహాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు ఫార్మా వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: (దేశీ రోడ్లపై కేటీఎం ప్రీమియం సైకిళ్లు!)

ఎక్కడి నుంచైనా
తమ సర్వీసులు విస్తరించిన 220 దేశాలలో రోజువారీ ప్రాతిపదికన వ్యాక్సిన్లను సరఫరా చేయగలమని డీహెచ్ఎల్‌ ఎక్స్‌ప్రెస్‌ సీఈవో జాన్‌ పియర్సన్‌ పేర్కొన్నారు. సాధారణ రోజుల్లో అయితే ప్రపంచవ్యాప్తంగా ఏదేశం నుంచి ఏదేశానికైనా 1-5 రోజుల వ్యవధిలో డెలివరీలు పూర్తిచేస్తుంటామని తెలియజేశారు. ఈ బాటలో కోవిడ్‌-19 వ్యాక్సిన్లను సైతం రవాణా చేయగలమని తెలియజేశారు. ఉదాహరణకు జర్మన్‌ కంపెనీ బయోఎన్‌టెక్‌తో భాగస్వామయ్ంలో ఫైజర్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను -75 సెల్షియస్‌లో రవాణా చేయవలసి ఉన్నట్లు ప్రస్తావించారు. ఇందుకు కంపెనీకి చెందిన వేర్‌హౌస్‌లు తదితర సప్లై చైన్‌ నెట్‌వర్క్‌ సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రవాణాలో భాగంగా రీఐసింగ్‌ స్టేషన్ల ద్వారా రీఐస్‌ ప్యాకేజ్‌ చేసేందుకు వసతులున్నట్లు వెల్లడించారు. వ్యాక్సిన్లను ఎక్కడినుంచైనా అంటే ప్రభుత్వ గిడ్డంగులు, ఆసుపత్రులు, వ్యక్తులు.. ఇలా ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా ఐదు రోజుల్లో సరఫరా చేయగలమని వివరించారు. గత రెండు దశాబ్దాలుగా మెడికల్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో క్రిటికల్‌ ప్రొడక్టులు, మెడికల్‌ యాక్సెసరీలను రవాణా చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

మరిన్ని వార్తలు