వేదాంత డీలిస్టింగ్‌ విఫలం

12 Oct, 2020 05:36 IST|Sakshi

బైబ్యాక్‌ గడువును పెంచే యోచన

న్యూఢిల్లీ: సాంకేతిక సమస్యల కారణంతో వేదాంత లిమిటెడ్‌ డీలిస్టింగ్‌ ప్రక్రియ సాధ్యపడలేదు. కన్ఫర్మ్‌ కాని ఆర్డర్ల సంఖ్య భారీ స్థాయిలో ఉండటం, షేర్లను దఖలు చేసే ప్రక్రియలో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తడం వంటి అంశాలు దీనికి కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బైబ్యాక్‌ ప్రక్రియను మరొక్క రోజు పొడిగించే అంశం సహా పలు ప్రత్యామ్నాయాలను కంపెనీ పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీఎస్‌ఈ గణాంకాల ప్రకారం అక్టోబర్‌ 9 సాయంత్రం నాటికి షేర్‌హోల్డర్ల దగ్గర 169.73 కోట్ల షేర్లు ఉండగా, ప్రమోటర్లకు వాటాదారులు 137.74 కోట్ల షేర్లను ఆఫర్‌ చేశారు. వాస్తవానికి 134.12 కోట్ల షేర్ల లభిస్తే ప్రమోటర్ల షేర్‌హోల్డింగ్‌ కంపెనీలో 90 శాతాన్ని దాటి డీలిస్టింగ్‌కు మార్గం సుగమమయ్యేది. కానీ కస్టోడియన్ల నుంచి ఆమోదముద్ర లభించకపోవడంతో కొన్ని బిడ్లు ప్రాసెస్‌ కాలేదు. దీంతో ఆఫర్‌ చేసిన షేర్ల సంఖ్య 125.47 కోట్లకు తగ్గింది. డీలిస్ట్‌ చేయడానికి ఇంతకు మించిన స్థాయిలో షేర్లను కొనుగోలు చేయాల్సి ఉండటంతో డీస్టింగ్‌లో దాఖలైన షేర్లను వాపసు చేసే అవకాశం ఉందని వేదాంత తెలిపింది. డేటా ప్రకారం డీలిస్టింగ్‌కు సంబంధించి చాలా మటుకు షేర్లను రూ. 320 రేటు చొప్పున షేర్‌హోల్డర్లు ఆఫర్‌ చేశారు. శుక్రవారం నాటి ముగింపు ధర రూ. 120తో పోలిస్తే ఇది భారీ ప్రీమియం కావడం గమనార్హం. 

>
మరిన్ని వార్తలు