వొడాఫోన్‌కు తప్పని నష్టాలు..ఏడు వేల కోట్లకుపైగా నష్టాలు

4 Nov, 2022 08:31 IST|Sakshi

వొడాఫోన్‌ నష్టం రూ. 7,595 కోట్లు

న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియా నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మరింతగా పెరిగాయి. రూ. 7,596 కోట్లకు చేరాయి. గత క్యూ2లో ఇవి రూ. 7,132 కోట్లు. అయితే, ఆదాయం మాత్రం సుమారు 13 శాతం పెరిగి రూ. 9,406 కోట్ల నుంచి రూ. 10,614 కోట్లకు చేరింది. యూజరుపై సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) 19.5 శాతం పెరిగి రూ. 131కి చేరింది.

సమీక్షాకాలంలో వొడాఫోన్‌ ఐడియా మొత్తం సబ్‌స్క్రయిబర్స్‌ సంఖ్య 24 కోట్ల నుంచి 23.44 కోట్లకు తగ్గినప్పటికీ 4జీ యూజర్ల సంఖ్య 15 లక్షలు పెరిగి 12 కోట్లకు చేరింది. సెప్టెంబర్‌ 30 నాటికి కంపెనీ మొత్తం రుణ భారం (లీజులకు చెల్లించాల్సినది కాకుండా) రూ. 2,20,320 కోట్లకు చేరింది. ఇందులో స్పెక్ట్రం చెల్లింపులకు సంబంధించిన మొత్తం రూ. 1,36,650 కోట్లు (ఇటీవల కొన్న స్పెక్ట్రం కోసం కట్టాల్సిన రూ. 17,260 కోట్లు సహా), సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్‌) లెక్కల కింద ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. 68,590 కోట్లు ఉన్నాయి. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు రూ. 15,080 కోట్లు కట్టాలి. ఫలితాల నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా షేరు 0.6 శాతం పెరిగి రూ. 8.6 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు