టోకు ద్రవ్యోల్బణం @ 29 నెలల కనిష్టం

18 Apr, 2023 04:43 IST|Sakshi

మార్చిలో 1.34 శాతం తగ్గిన ఇంధనం, తయారీ ఉత్పత్తుల భారం

ఆహార ఉత్పత్తులు ప్రియం

న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం మార్చిలో 29 నెలల కనిష్టానికి దిగి వచ్చింది. 1.34 శాతానికి పరిమితమైంది. ఇంధనాలు, తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గగా, ఆహార ఉత్పత్తుల భారం మాత్రం పెరిగింది. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.85 శాతంగాను, గతేడాది మార్చిలో 14.63 శాతంగాను నమోదైంది. ఇది తగ్గడం వరుసగా పదో నెల. చివరిసారిగా 2020 అక్టోబర్‌లో డబ్ల్యూపీఐ ఆధారిత ధరల పెరుగుదల 1.31 శాతంగా నమోదైంది.

‘2023 మార్చిలో ద్రవ్యోల్బణం రేటు తగ్గడానికి ప్రధానంగా ప్రాథమిక లోహాలు, టెక్స్‌టైల్స్, ఆహారయేతర ఆర్టికల్స్, ఖనిజాలు, రబ్బర్‌.. ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, క్రూడ్‌ పెట్రోలియం .. సహజ వాయువు, పేపర్‌ .. పేపర్‌ ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడమే కారణం‘ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సోమవారం తెలిపింది.

తాజాగా ఫుడ్‌ బాస్కెట్‌లో గోధుమలు వంటి ధాన్యాల ధరలు నెమ్మదించగా.. కూరగాయలు, పండ్లు, పాలు, పప్పులు మొదలైన వాటి రేట్లు పెరిగాయని ఈక్విరస్‌ సెక్యూరిటీస్‌ ఒక నోట్‌లో పేర్కొంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఇప్పుడు కూడా వడ్డీ రేట్ల పెంపు విషయంలో నిర్ణయం తీసుకునే ముందు డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం స్థిరపడేలా చూడటంపైనా, వినియోగ ధరల ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం మరింత తగ్గేలా చూడటంపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుందని టీఐడబ్ల్యూ క్యాపిటల్‌ సీఈవో మోహిత్‌ రాల్హన్‌ అభిప్రాయపడ్డారు.
 
► ఆహార ఉత్పత్తుల రేట్ల పెరుగుదల ఫిబ్రవరిలో 3.81 శాతంగా ఉండగా, మార్చిలో 5.48 శాతంగా నమోదైంది. కూరగాయల ధరలు ఫిబ్రవరిలో  21.53 శాతం తగ్గగా (2022 ఫిబ్రవరి ధరతో పోల్చి), మార్చిలో  ఈ తగ్గుదల రేటు 2.22 శాతంగానే ఉంది. ఉల్లి విషయంలో ఫిబ్రవరిలో  40.14 శాతం ధరలు తగ్గగా, మార్చిలో తగ్గుదల రేటు 36.83 శాతంగానే నమోదైంది.
► గోధుమల ధరలు 9.16 శాతం, పప్పుల రేట్లు 3.03 శాతం పెరిగాయి.

 

మరిన్ని వార్తలు