టోకు ద్రవ్యోల్బణం... 9 నెలల గరిష్టం

15 Dec, 2020 06:10 IST|Sakshi

నవంబర్‌లో 1.55 శాతం

తయారీ ఉత్పత్తుల ధరల పెరుగుదల నేపథ్యం  

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్‌లో 1.55 శాతంగా నమోదయ్యింది. అంటే టోకు బాస్కెట్‌లోని ఉత్పత్తుల ధర 2019  నవంబర్‌తో పోల్చితే, 2020 నవంబర్‌లో 1.55 శాతం పెరిగిందన్నమాట. ఫిబ్రవరిలో 2.26 శాతం నమోదు తర్వాత,  గడచిన తొమ్మిది నెలల్లో ఈ స్థాయి టోకు ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. మొత్తం సూచీలో దాదాపు 60 శాతంగా ఉన్న తయారీ ఉత్పత్తుల ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు.  2020 అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం స్పీడ్‌ 1.48 శాతం అయితే, గత ఏడాది నవంబర్‌లో ఇది 0.58 శాతంగా ఉంది. 
 
► నవంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 3.94 శాతంగా ఉంది. అక్టోబర్‌ (6.37 శాతం)లో నమోదుకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. ఒక్క కూరగాయల ధరలను చూస్తే, 12.24 శాతం పెరిగాయి. ఆలూ విషయంలో ధరల పెరుగుదల తీవ్రంగా 115.12 శాతంగా ఉంది.  
► నాన్‌–ఫుడ్‌ ఆర్టికల్స్‌ విషయానికి వస్తే, ధరల పెరుగుదల 8.43%.  
► ఫ్యూయెల్, పవర్‌ బాస్కెట్‌లో ధర లు పెరక్కపోగా 9.87% తగ్గాయి.  

రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.93 శాతం
మరోవైపు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం క్రమంగా దిగివస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నవంబర్‌లో ఇది 6.93 శాతంగా నమోదయ్యింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష, కీలక రేట్ల నిర్ణయానికి రిటైల్‌ ద్రవ్యోల్బణమే ప్రాతిపదికగా ఉంటుంది. ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం, రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 – 2 శాతం మధ్య ఉండాలి. దీని ప్రకారం నవంబర్‌ సూచీ అధికంగానే ఉన్నప్పటికీ, అక్టోబర్‌ 7.61 శాతం కన్నా తగ్గడం గమనార్హం.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు