జీ టీవీకి ఝలక్‌ !

3 Feb, 2022 08:32 IST|Sakshi

క్యూ 3 లాభాల్లో వెనకడుగు 

నికర లాభం రూ. 299 కోట్లకు పరిమితం  

న్యూఢిల్లీ: మీడియా రంగ దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌(జీల్‌) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం రూ. 99 కోట్లు తగ్గి రూ. 299 కోట్లకు పరిమితమైంది.

గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 398 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,757 కోట్ల నుంచి రూ. 2,130 కోట్లకు క్షీణించింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఫలితాలను పోల్చి చూడతగదని కంపెనీ పేర్కొంది. ఇక మొత్తం వ్యయాలు రూ. 1,701 కోట్లకు చేరాయి. క్యూ3 టర్నోవర్‌లో ప్రకటనల నుంచి రూ. 1,261 కోట్లు, సబ్‌స్క్రిప్షన్‌ ఆదాయం రూ. 790 కోట్లు, ఇతర సర్వీసులు, అమ్మకాల నుంచి రూ. 62 కోట్లు చొప్పున లభించాయి. 

గత క్యూ3లో ఇతర సర్వీసుల పద్దుకింద భారీగా రూ. 842 కోట్ల ఆదాయం నమోదుకావడం గమనార్హం! ఈ కాలంలో సోనీ పిక్చర్స్‌ అనుబంధ సంస్థతో విలీనమయ్యేందుకు జీల్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం విదితమే. 
 

మరిన్ని వార్తలు