వర్షానికి కూలిన ఇల్లు.. ఇద్దరి మృతి 

12 Oct, 2020 02:11 IST|Sakshi
హుస్సేనీఆలంలో కూలిన పురాతన భవనం

మరో ఐదుగురికి తీవ్ర గాయాలు  

హైదరాబాద్‌ పాతబస్తీలో ఘటన 

మృతుల్లో పెళ్లి కూతురు 

హైదరాబాద్‌: భారీ వర్షానికి పాతబస్తీలోని హుస్సేనీఆలంలో సుమారు వందేళ్ల నాటి భవనంలో ఓ భాగం ఆదివారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ భవనం కింది భాగంలో దుకాణ సముదాయాలు ఉండగా... మొదటి అంతస్తులో హజీ మహ్మద్‌ ఖాన్‌ (54) కుటుంబం నివాసముంటుంది. ఆదివారం ఉదయం దాదాపు 11 గంటల సమయంలో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న హజీ మహ్మద్‌ ఖాన్‌తోపాటు పర్వీన్‌ బేగం (42), అజ్మత్‌ ఖాన్‌ (28), ఫర్హా బేగం (24), హుస్సేన్‌ ఖాన్‌ (2), హసన్‌ ఖాన్‌ (4 నెలలు), అనీషా బేగం (18) శిథిలాల కింద చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాద వార్త తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ కార్యక్రమాలను చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అనీషా బేగం, పర్వీన్‌ బేగం మృతి చెందారు. మిగతా ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. భవనం మిగతా భాగాన్ని అధికారులు తొలగించారు. 

మరో వారంలో పెళ్లి.. 
హజీ మహ్మద్‌ ఖాన్‌ కుమార్తె అనీషా బేగం వివాహం ఈ నెల 19న జరగాల్సి ఉంది. ఆదివారం కావడంతో అందరూ ఇంట్లోనే ఉండి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అనీషా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు విలపిస్తున్నారు. హుస్సేనీఆలం ప్రాంతంలో 50కిపైగా పురాతన భవనాలు ఉండటంతో అవి ఎప్పుడు కూలుతాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరో ప్రమాదం జరగక ముందే అలాంటి భవనాలను కూల్చేయాలని అధికారులను కోరుతున్నారు.

మరిన్ని వార్తలు