మచిలీపట్నంలో విషాదం.. పబ్జీ గేమ్‌కు అలవాటుపడి మైనర్‌ ఆత్మహత్య

12 Jun, 2022 14:05 IST|Sakshi

సాక్షి, కృష్ణా: మచిలీపట్నంలో విషాదం చోటుచేసుకుంది. మొబైల్‌లో పబ్జీ గేమ్‌కు అలవాటుపడి మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.  న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఊటుకూరు ప్రభు (16) తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో శనివారం రాత్రి ఇంట్లో వాళ్లతో కలిసి పబ్జి గేమ్ ఆడాడు. అయితే గేమ్‌లో ఓడిపోవడంతో ఇంట్లో వాళ్లు ప్రభును కాస్తా ఆటపట్టిస్తూ హేళన చేశారు.

దీంతో అవమానం తట్టుకోలేక వేరే గదిలో పడుకుంటానని చెప్పి ప్రభు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఉదయం ఎంత సేపటికి బయటకి రాకపోవడంతో నిద్ర లేపేందుకు తండ్రి తలుపులు తీయడంతో గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కొడుకు ఉరికి వేలాడుతూ కనిపించడంతో అది చూసిన తండ్రి సొమ్మసిల్లి పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు