రెగ్యులర్‌గా డ్రగ్స్‌ వాడుతాడేమో

21 Oct, 2021 05:14 IST|Sakshi

బయటికొస్తే సాక్ష్యాధారాలను తారుమారుచేసే అవకాశం

అందుకే బెయిల్‌ అభ్యర్థనను తిరస్కరిస్తున్నాం

ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్‌పై ముంబై స్పెషల్‌ కోర్టు వ్యాఖ్య

ముంబై: బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ తరచుగా మత్తు పదార్థాలను వినియోగిస్తాడనే భావన కలుగుతోందని ముంబైలోని స్పెషల్‌ కోర్టు వ్యాఖ్యానించింది. ముంబైలోని క్రూయిజ్‌ నౌకలో మత్తు పదార్థాలు పట్టుబడిన కేసులో అరెస్టయిన ఆర్యన్, అతని స్నేహితుడు అర్బాజ్‌ మర్చంట్, ఫ్యాషన్‌ మోడల్‌ మున్మున్‌ ధమేచల బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టు బుధవారం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఆర్యన్‌ వాట్సాప్‌ చాట్స్‌ను పరిశీలిస్తే డ్రగ్స్‌ విక్రేతలను తరచూ కలుస్తాడనే విషయం స్పష్టమవుతోందని నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ (ఎన్‌డీపీఎస్‌) చట్టాల సంబంధ కేసులను విచారించే కోర్టు స్పెషల్‌ జడ్జి వీవీ పాటిల్‌ వ్యాఖ్యానించారు. ‘కేసులో ఆధారాలుగా  కోర్టుకు ఎన్‌సీబీ సమర్పించిన ఆర్యన్‌ వాట్సాప్‌ చాట్స్‌ను గమనిస్తే ఇతనికి రెగ్యులర్‌గా డ్రగ్స్‌ వాడే అలవాటుందని తెలుస్తోంది. ఆర్యన్‌కు బెయిల్‌ ఇస్తే బయటికొచ్చాక మళ్లీ ఈ తప్పు చేయబోడని మేం ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నాం. అందుకే బెయిల్‌ అభ్యర్థనను తిరస్కరిస్తున్నాం’ అని కోర్టు ఉత్తర్వులో జడ్జి వ్యాఖ్యానించారు.

‘నౌకలో సోదాల సమయంలో ఆర్యన్‌ వద్ద డ్రగ్స్‌ లేవు. కానీ స్నేహితులు అర్బాజ్, మున్మున్‌ల వద్ద డ్రగ్స్‌ ఉన్నాయనే విషయం ఆర్యన్‌కు తెలుసు. సరదా కోసం, వినియోగం కోసం డ్రగ్స్‌ వెంట తెచ్చుకుంటామని అరెస్ట్‌ అయ్యాక ఇచ్చిన వాంగ్మూలాల్లో ఆర్యన్, అర్బాజ్‌ ఒప్పుకున్నారు. డ్రగ్స్‌ను సరఫరా చేసే, విక్రయించే వ్యక్తులతో ఆర్యన్‌కు మంచి పరిచయాలు ఉన్నాయి. ఆర్యన్‌కు బెయిల్‌ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. నిషేధిత డ్రగ్స్‌తో సంబంధమున్న ఈ ముగ్గురికి బెయిల్‌ మంజూరు కుదరదు’ అని జడ్జి తేల్చిచెప్పారు. దీంతో ఆర్యన్‌ తరఫు లాయర్లు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ జస్టిస్‌ ఎన్‌ డబ్ల్యూ సాంబ్రే నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్‌ ముందు పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ గురువారం విచారణకు రానుంది. గత 18 రోజులుగా ఆర్యన్‌ ముంబైలోని ఆర్థర్‌ రోడ్‌ జైలులోనే గడుపుతున్నారు.

మరిన్ని వార్తలు