రూ.వెయ్యి లాభం.. రూ.3.14 లక్షల నష్టం!

9 Apr, 2021 08:32 IST|Sakshi

 క్రిప్టో కరెన్సీ పేరుతో ఎర వేసిన సైబర్‌ నేరగాడు 

 తొలుత రూ.23 వేలకు బిట్‌కాయిన్‌ పంపిన వైనం 

 వీటిని విక్రయించగా బాధితుడికి రూ.వెయ్యి లాభం 

ఆఫర్‌ పేరుచెప్పి పలు దఫాలుగా భారీ మొత్తం స్వాహా 

సాక్షి, సిటీబ్యూరో: క్రిప్టో కరెన్సీగా పిలిచే బిట్‌కాయిన్స్‌పై మోజుతో నగరానికి చెందిన ఓ నిరుద్యోగి సైబర్‌ నేరగాడి వల్లో పడ్డాడు. తొలుత ఇతడికి రూ.వెయ్యి లాభం వచ్చేలా చేసిన ఆ దుండగుడు ఆపై ఆఫర్స్‌ పేరు చెప్పి రూ.3.14 లక్షలు కాజేశాడు. ఎట్టకేలకు తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు గురువారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసు అధికారులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అసలు ఈ మోసం ఎలా జరిగింది 
►  నగరానికి చెందిన మనీష్‌ బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. బిట్‌కాయిన్స్‌పై ఆసక్తి ఉన్న ఇతగాడు తన స్మార్ట్‌ ఫోన్‌లో బినాన్స్‌ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. 

►  ఈ యాప్‌లో ఉండే  గ్రూపుల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బిట్‌కాయిన్స్‌ క్రయ, విక్రేతలు ఉంటారు. ఈ ప్లాట్‌ఫామ్‌లోనే మనీష్‌కు బెంగళూరుకు చెందిన వ్యక్తి పరిచయమయ్యాడు. 
►   అతడి నుంచి తొలుత రూ.5 వేలు, రూ.5 వేలు, రూ.13 వేలు వెచ్చించి మూడు బిట్‌కాయిన్లు ఖరీదు చేశాడు. వీటిని బినాన్స్‌లోనే విక్రయానికి పెట్టగా మనీష్‌కు రూ.24 వేలు వచ్చాయి. ఇలా రూ.వెయ్యి లాభం పొందిన ఇతగాడు బెంగళూరు వాసిని పూర్తిగా నమ్మాడు. 
►   ఆపై చాటింగ్‌ ద్వారా మనీష్‌ను సంప్రదించిన బెంగళూరు వాసి ప్రత్యేక ఆఫర్‌ నడుస్తోందని, రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడి పెడితే ఒక శాతం బిట్‌కాయిన్‌ బోనస్‌గా వస్తుందని నమ్మబలికాడు. 
►   దీంతో మనీష్‌ బిట్‌ కాయిన్‌ ఖరీదు చేసేందుకు రూ.25 వేలు బదిలీ చేశాడు. అయితే ఆ ఆఫర్‌ పొందాలంటే మరో రూ.23,526 పంపాలంటూ బెంగళూరు వాసి కోరాడు. ఇలా మొత్తం 15 లావాదేవీల్లో మనీష్‌ నుంచి రూ.3.14 లక్షలు కాజేశాడు. 
►  మనీష్‌ ఈ మొత్తాలను యూపీఐ లావాదేవీలు, బ్యాంక్‌ ఖాతాలకు బదిలీ ద్వారా పంపాడు. మరో రూ.24 వేలు పంపిస్తేనే ఆఫర్‌ వర్తిస్తుందంటూ బెంగళూరు వాసి చెప్పడంతో మనీష్‌కు అనుమానం వచ్చింది.  
►  తన డబ్బు తిరిగి ఇవ్వాలని, లేదంటే ఆ మొత్తానికి సరిపడా బిట్‌కాయిన్స్‌ పంపాలని బెంగళూరు వాసిని పలుసార్లు విజ్ఞప్తి చేశాడు. దీంతో తన వద్ద ఉన్న డబ్బంతా బిట్‌కాయిన్స్‌ల్లో ఇరుక్కుందని అతడు చెప్పాడు. 
►   రూ.20 వేలు పంపిస్తే రూ.1.7 లక్షలు లోన్‌ తీసుకుని ఆ మొత్తం చెల్లిస్తానని, అంతకు మించి ఇవ్వలేనని బుధవారం స్పష్టం చేశాడు. మళ్లీ గురువారం అడగ్గా... రూ.30 వేలు పంపాలని, రూ.7 లక్షలు రుణం తీసుకుని మొత్తం రూ.3.14 లక్షలు చెల్లిస్తానన్నాడు. 
►   అతడి గుర్తింపు కార్డులు పంపాలంటూ మనీష్‌ కోరగా... తనకు లేవని, కుటుంబీకుల పేరుతో కొన్ని పంపాడు. మనీష్‌ వేరే ఫోన్‌ నంబర్‌ నుంచి బినాన్స్‌ యాప్‌లోకి ప్రవేశించి బెంగళూరు వాసితో కొత్త వ్యక్తిలా చాటింగ్‌ చేశాడు. 
►    తనకు రూ.50 వేల బిట్‌కాయిన్స్‌ కావాలని, ఆ మొత్తం పంపడానికి గుర్తింపుకార్డు షేర్‌ చేయాలని కోరాడు. దీనికి అంగీకరించిన బెంగళూరు వాసి తన ఆధార్‌ కార్డు ప్రతిని షేర్‌ చేశాడు. 
    అతగాడు తనను ఉద్దేశపూర్వకంగానే మోసం చేశాడని గ్రహించిన మనీష్‌ గురువారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణా లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతిక దర్యాప్తు ప్రారంభించారు. 

   ( చదవండి: వామ్మో.. ‘ఖతర్‌’నాక్‌ మోసం! )

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు