బాలికపై అత్యాచారం కేసు..

16 Dec, 2023 05:10 IST|Sakshi

యూపీ బీజేపీ ఎమ్మెల్యేకి 25 ఏళ్ల జైలు

సోన్‌భద్ర: బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్‌దులార్‌ గోండ్‌కు ప్రత్యేక న్యాయస్థానం 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, మరో రూ.10 లక్షల జరిమానా విధించింది. దీంతో, శాసనసభ సభ్యత్వానికి ఆయన అర్హత కోల్పోనున్నారు. తొమ్మిదేళ్ల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటనపై ఈ నెల 12న కోర్టు విచారణ ముగిసింది. సోన్‌భద్ర అడిషనల్‌ జడ్జి, ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు సెషన్‌ జడ్జి అహ్సానుల్లా ఖాన్‌ తాజాగా తీర్పు వెలువరించారు.

జరిమానా మొత్తాన్ని బాధితురాలి కుటుంబ సంక్షేమం కోసం వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2014లో ఈ ఘటన చోటుచేసుకోగా ఆ సమయంలో రామ్‌దులార్‌ గోండ్‌ భార్య గ్రామ సర్పంచిగా ఉన్నారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు మియోర్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో గోండ్‌పై పోక్సో సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. మొదట్లో పోక్సో ప్రత్యేక కోర్టులో కేసు విచారణ సాగింది. బీజేపీ తరఫున గోండ్‌ దుద్ధి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యాక ఈ కేసు ఎంపీ/ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ అయ్యింది.

>
మరిన్ని వార్తలు