అవసరమైన సామాజిక కూర్పు | Sakshi
Sakshi News home page

అవసరమైన సామాజిక కూర్పు

Published Sat, Dec 16 2023 4:28 AM

Big Change In Politics Social Changes in All States Bjp Win Elections - Sakshi

ఇటీవలి ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించిన మూడు రాష్ట్రాలకు కొత్త ముఖ్యమంత్రులే వచ్చారు. ఇదొక కొత్త రాజకీయ సంప్రదాయం కాబట్టి చర్చ కూడా పెద్ద ఎత్తునే జరుగుతోంది. అది రాజకీయ పార్టీలు మంచి చేసినప్పుడు జరగవలసిన చర్చేనా? ఇది ప్రశ్నార్థకమే. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం అంటే, అది ఏ పార్టీ మనస్ఫూర్తిగా, నిజాయితీగా చేసినా స్వాగతించాలి. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కూడా ఈ విషయంలో పట్టింపుగా ఉన్నారు. ఈ ప్రస్తావన ఎందుకంటే, సోషల్‌ ఇంజినీరింగ్‌ కోసం ఏ పార్టీ అయినా ప్రయత్నిస్తుంటే ఆ విషయం చెప్పడానికి సందేహించనక్కర లేదు. మనం ఒక పార్టీని అభిమానించడం, ఆ పార్టీ చేపట్టే సోషల్‌ ఇంజినీరింగ్‌ను సానుకూలంగా గమనించడం, ఈ రెండూ అవసరమే.

ఇటీవల గెలిచిన మూడు రాష్ట్రాల్లోనూ మాజీ లను కాదని, కొత్తవారిని ముఖ్యమంత్రి స్థానాల్లో కూర్చోబెట్టింది బీజేపీ. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ స్థానంలో మోహన్‌ యాదవ్‌కూ, రాజస్థాన్‌లో వసుంధరా రాజేను కాదని మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన భజన్‌లాల్‌ శర్మకూ, ఛత్తీస్‌గడ్‌లో మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు స్పీకర్‌ స్థానం ఇచ్చి విష్ణుదేవ్‌ సాయ్‌కీ బీజేపీ అధిష్ఠానం ముఖ్యమంత్రి స్థానాలను అప్ప గించింది. ఇలాంటి నిర్ణయం రాజకీయాలకు కొత్త. ఒకే దెబ్బతో నిర్ణయించడం కూడా కొత్తే. 

2018 ఎన్నికల తరువాత రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచింది. కానీ గతంలో ముఖ్యమంత్రులుగా చేసినవారినే తిరిగి ప్రతిష్టించారు. అది సర్వసాధారణ సంప్రదాయమనే అంతా సర్దుకు పోయారు. ఆ మూస ధోరణితో ఇద్దరు యువనేతలకు అవకాశం లేకుండా పోయిందన్న వాస్తవం మరుగున పడింది. కొత్తవారికి అవ కాశాల సంగతి ఆ పార్టీలో ప్రశ్నార్థకమైందన్న వాదన కూడా వీగి పోయింది. కానీ ఇప్పుడు ఓడిపోతుందని అంతా అనుకున్న మధ్య ప్రదేశ్‌లో ఘన విజయం సాధించి పెట్టిన శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను వదిలిపెట్టి వేరొకరికి బీజేపీ అధికారం కట్టబెట్టడం అనూహ్యంగానే కనిపిస్తుంది. వసుంధరా రాజే వంటి దిగ్గజాన్ని ముఖ్యమంత్రి పదవికి దూరంగా ఉంచగలగడం కూడా అలాంటిదే. భజన్‌లాల్‌ శర్మకు ముఖ్యమంత్రిగా అవకాశం రావడం మరీ ఊహకు అందనిదే. 


ఈ ముగ్గురికీ ప్రత్యేకతలు ఉన్నాయి. బీజేపీతో, లేదా మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌తో వీరికి విశేషమైన సాన్నిహిత్యం ఉంది. ఎవరూ ఇతర పార్టీల నుంచి దిగుమతి అయినవారు కాదు. అయోధ్య ఉద్య మంతో మమేకమైనవారు భజన్‌లాల్‌ శర్మ. ఇవన్నీ సాధారణ ప్రజా నీకం దృష్టిలో పడని అభ్యర్థుల అర్హతలే అవుతాయి. వీరి పాలనా నుభవం, ప్రజాహిత కార్యక్రమాలు, ప్రజల మధ్యన ఉండే తత్త్వం ఇవన్నీ పార్టీ పరిగణనలోకి తీసుకునే అంశాలు అవుతాయి. ఒక నాయ కుడిని మూడు లేదా నాలుగు పర్యాయాలు పదవిలో కొనసాగించడం వల్ల, తద్వారా ఎదురయ్యే ప్రభుత్వ వ్యతిరేకత పార్టీ భవిష్యత్తుకు సంబంధించినది. కొత్త నాయకత్వాన్ని నిర్మించే ప్రక్రియ కూడా పార్టీ తాజా నిర్ణయంలో కనిపిస్తోంది. మొత్తంగా పార్టీ ప్రయోజనాల రక్షణ, అభ్యర్థి సామర్థ్యం, గుణగణాలు ఇవన్నీ పార్టీ మనుగడకు పరోక్షంగా దోహదం చేస్తాయి. 


దీనితో పాటే పట్టించుకోవలసిన మరొక లోతైన అంశం, పార్టీ అనుసరించిన సోషల్‌ ఇంజినీరింగ్‌. దురదృష్టవశాత్తు బీజేపీ అమలు చేయదలిచిన సోషల్‌ ఇంజినీరింగ్‌కు మీడియా చర్చలు, పత్రికల కాల వ్‌ులు తగిన స్థానం ఇస్తున్నాయా? ఇవ్వడం లేదన్నదే సమాధానం. సమాజంలోని అన్ని వర్గాలకు సామాజిక, రాజకీయ ప్రాధాన్యం కల్పించాలి. స్త్రీపురుష సమానత్వం కూడా అందులో భాగం. వీటిని ఇప్పటికైనా పార్టీలో, ప్రభుత్వంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నందుకు బీజేపీని మనసారా అభినందించవలసి ఉంటుంది. ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించకుండా ఏళ్ల తరబడి ప్రభుత్వం నడిపిన ముఖ్యమంత్రులు మన కళ్లెదుటే ఉన్నారు.

కొన్ని వర్గాలవారు అసలు శాసనసభ ముఖం చూడలేదన్నది ఒక చేదునిజం. వీటిని అధిగమించి తీరాలి. లేకుంటే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. అదే సమయంలో అప్పటిదాకా రాజకీయాలలో, పాలనలో తగినన్ని అవ కాశాలను పొందిన వారికీ, ఇప్పుడు పొందవలసి ఉన్నవారికీ మధ్య సమతూకం పాటిస్తేనే ఏ పార్టీ అయినా మనుగడ సాగించగలుగుతుందన్నది ఒక వాస్తవం. మొత్తం వ్యవస్థను పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా, ఓటు ద్వారా మార్చదలిచిన ఏ పార్టీ అయినా ఈ సూత్రానికి దగ్గరగా పనిచేస్తుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు కొత్త ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల ఎంపికలో బీజేపీ చేసిన కసరత్తు ఇందుకు సంబంధించినదే!

అయితే, ఏ అడుగు వేసినా అందులో ఎన్నికల కోణాన్ని మాత్రమే చూడడం ఇటీవలి చర్చలు, విశ్లేషణలలో కనిపించే ఒక అవాంఛనీయ పరిణామం. ఇప్పుడు బీజేపీ ఎంపికను కూడా విశ్లేషకులు మూస ధోరణిలో ఎన్నికల వ్యూహాన్నే చూస్తున్నారు. మీడియా ఏం చర్చించాలో పాఠాలు చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. అయితే అభ్యర్థుల ఎంపిక గురించి పార్టీలు తీసుకున్న నిర్ణయాలు, ఎంపికలు తమ ఊహాగానాలకు, సర్వేలకు అనుకూలంగా లేవేమిటని వారు ఆశ్చర్యం పోవడం కూడా వింతే అనిపిస్తుంది. తాము ఎంతో ఖర్చు చేసి చేయించిన సర్వేల కంటే బీజేపీకి ఎక్కువ స్థానాలు రావడమేమిటన్న ఒక అసంబద్ధ వైఖరి కూడా కొందరు మీడియా వారు పరోక్షంగా అయినా వ్యక్తం చేయడం నిజం. ఇలాంటివారు మొదట చేయవలసిన పని ఆ తీర్పు ప్రజలు ఇచ్చినదని గౌరవించడం. 

అలాగే ఊహాగానాలకు అతీతంగా ముఖ్యమంత్రి అభ్యర్థుల పేర్లు వచ్చినా బుగ్గలు నొక్కుకోవడం ఎందుకు? పార్టీ కొత్తవారికి అవకాశం ఇవ్వదలిచింది. గతం కంటే మెరుగ్గా సోషల్‌ ఇంజినీరింగ్‌కు స్థానం కల్పించాలని అనుకున్నది. దాని ఫలితమే ఇలాంటి ఎంపిక. తెలంగాణలో బీసీ వర్గానికి చెందిన వారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తా నని చెప్పిన తరువాత ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక జరిగింది. అందులో తెలంగాణకు ఇచ్చిన హామీ జాడలు కనిపిస్తున్నాయి కూడా. దీనిని గుర్తించడం అవసరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యాభయ్‌ శాతం ఉన్న ఓబీసీలకు ఆ అవకాశం దాదాపు రాలేదు. దానిని గుర్తించి, ఆ తప్పిదాన్ని సవరించే ప్రయత్నం బీజేపీ చేసింది.

ఈ అంశం గురించి సరైన దారిలో చర్చ జరిపితే అది అన్ని పార్టీలకు ఉపయోగపడుతుంది. బీజేపీ చేసింది కాబట్టి మేము అనుసరించ బోమని మిగిలిన పార్టీలు అంటే అది వేరే విషయం. అలాంటి అభిప్రా యానికి మీడియా కూడా రాకూడదన్నదే ఇక్కడ చెప్పదలుచుకున్నది. ఎప్పుడు ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడుతున్నా విశ్లేషణలు వస్తు న్నాయి. ఏ సంవత్సరం ఎన్ని ఓట్లు వచ్చాయి, శాతం, ప్రాంతాల వారీగా అభ్యర్థులు, గెలుపోటములు విశ్లేషిస్తున్నారు. ఇవన్నీ స్వాగతించవలసినవే. వాటితో పాటు సోషల్‌ ఇంజినీరింగ్‌ విషయంలో పార్టీలలో వస్తున్న పురోగతి గురించి, అలాంటి ఆహ్వానించదగిన పరి ణామం గురించి పార్టీలు పెడుతున్న శ్రద్ధలో వచ్చిన గ్రాఫ్‌ గురించి కూడా చర్చ జరిగితే రాజకీయాల గతినైనా మార్చవచ్చు. 

మిగిలిన విషయాలు ఎలా ఉన్నా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ ఈ విషయంలో ముమ్మాటికి పట్టింపుగా ఉన్నారు. సోషల్‌ ఇంజి నీరింగ్‌కు, స్త్రీపురుష సమానత్వానికి ఆయన తగిన ప్రాధాన్యం కల్పి స్తున్నారు. ఈ ప్రస్తావన ఎందుకు అంటే, సోషల్‌ ఇంజినీరింగ్‌ను పాటించడానికి ఏ పార్టీ అయినా ప్రయత్నం చేస్తుంటే ఆ విషయం చెప్పడానికి సందేహించనక్కర లేదు. మనం ఒక పార్టీని అభిమానించడం, ఆ పార్టీ చేపట్టే సోషల్‌ ఇంజినీరింగ్‌ను సానుకూలంగా గమనించడం, ఈ రెండూ అవసరమే.

ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం అంటే, అది ఏ పార్టీ మనస్ఫూర్తిగా, నిజాయితీగా చేసినా స్వాగతించాలి. అదే బాధ్యతాయుతమైన పౌరుల లక్షణం కూడా. అనేక కారణాలతో, వందల సంవత్సరాల విదేశీ పాలన ఫలితంగా ఇక్కడ అలాంటి సమ తూకం, క్రమం దెబ్బతిన్నాయి. దానిని సరిదిద్దే బాధ్యతను అన్ని రాజ కీయ పార్టీలు స్వీకరించాలి. బడుగు బలహీన వర్గాల గురించి, మైనా రిటీల గురించి ఇంతగా మాట్లాడే వామపక్ష, ఉదారవాద పార్టీలు కూడా ఆ విషయంలో పెద్దగా సాధించినది ఏమీలేదు. అంతమాత్రాన బీజేపీ ఆ ప్రయత్నంలో ఉంటే అందులో రాజకీయాలు, ఎన్నికల వ్యూహాలు చూడడం మంచిది కాదు. అందుకు సంబంధించిన కీర్తి బీజేపీదే అయితే దానికే దక్కనివ్వాలి!


వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్‌ చైర్మన్‌

Email:pvg@ekalavya.net

Advertisement
Advertisement