12 గంటల్లోనే తల్లిదండ్రుల చెంతకు..

4 Oct, 2023 03:59 IST|Sakshi

తిరుపతి బస్టాండ్‌లో తెల్లవారుజామున 2.12 గంటలకు బాలుడి కిడ్నాప్‌ 

ఉదయం 11.30 గంటలకు నిందితులను పట్టుకున్న పోలీసులు 

సురక్షితంగా తల్లిదండ్రులకు బాలుడి అప్పగింత 

తిరుపతి క్రైం: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న ఓ బాలుడు తెల్లవారుజామున కిడ్నాప్‌ కాగా... 12 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించి తిరిగి ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసు వివరాలను మంగళవారం తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి మీడియాకు వివరించారు. చెన్నైకి చెందిన చంద్రశేఖర్, మీనా దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి సోమవారం అర్ధరాత్రి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లోని చెన్నై ప్లాట్‌ఫాం వద్ద నిద్రపోయారు.

తెల్లవారుజామున మెలకువ వచ్చి చూడగా, రెండో కుమారుడు అరుల్‌ మురుగన్‌(2) కనిపించలేదు. దీంతో వెంటనే తిరుపతి ఈస్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి డీఎస్పీ సురేందర్‌రెడ్డి, క్రైం డీఎస్పీ రవికుమార్, సీఐ మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలు వెంటనే బా­లు­డి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. సీపీ ఫుటేజ్‌ ఆధారంగా బాలుడిని తెల్ల­వారుజామున 2.12 గంటలకు కిడ్నాప్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని అవిలాల సుధాకర్‌గా నిర్ధారించుకుని పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో అవిలాల సుధాకర్‌ కిడ్నాప్‌ చేసిన బాలు­డి­ని ఏర్పేడు మండలంలోని మాల గ్రామంలో తన అక్క నెల్లూరి ధనమ్మ వద్ద­కు తీసుకెళ్లి వదిలిపెట్టినట్టుగా సమాచారం అందింది. మంగళవారం ఉద­యం 11.30 గంటల సమయంలో పోలీసులు వెళ్లి బాలుడిని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడు సుధాకర్‌తోపాటు ధనమ్మ, మరికొందరిని ఈస్ట్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని సమగ్రంగా విచారణ చేపడుతున్నారు.

మరిన్ని వార్తలు