ఇంజన్ల మోత ఉండదిక! | Sakshi
Sakshi News home page

ఇంజన్ల మోత ఉండదిక!

Published Wed, Oct 4 2023 4:02 AM

The growing popularity of electric vehicles - Sakshi

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కర్బన ఉద్గారాలపై ఆందోళన ఎక్కువవుతోన్న నేపథ్యంలో విద్యుత్‌ వాహనాలు (ఈవీ)లకు ఆదరణ పెరుగుతోంది. ఏటా 10 లక్షలకు పైగా ఈవీలను వాహనదారులు కొనుగోలు చేస్తున్నారు. గతేడాది 10.4 లక్షల వాహన విక్రయాలు జరగ్గా..ఈ ఏడాది అది 13.8 లక్షలకు, 2030 నాటికి 30 మిలియన్లకు చే­రుకుంటుందని అంచనా.

ఈ ఏడాది అమ్ము­­డవుతోన్న మొత్తం ద్విచక్ర వాహ­నాల్లో 4.5% ఎలక్ట్రిక్‌ వాహనాలే ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో వాటికి అవసరమైన చార్జింగ్‌ స్టేషన్లూ భారీగా ఏర్పాటవుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి 6 వేల చార్జింగ్‌ స్టేషన్లు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్నాయి. బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) నివేదిక ప్రకారం..

దేశంలో 9,113 పబ్లిక్‌ ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు 15,493 ఈవీ చార్జర్లలో పనిచేస్తున్నాయి. వాహనాలకనుగుణంగా ఈవీ చార్జర్ల విక్రయాలూ పెరుగుతున్నాయి. అది ఎంతగా అంటే 2030 నాటికి దేశంలో ఈవీ చార్జర్ల డిమాండ్‌ ప్రస్తుతం ఉన్నదానికంటే 65% పెరుగుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ లెక్కన ఏడేళ్లలో 30 లక్షల చార్జర్లు అవసరమని కస్టమైజ్డ్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ (సీఈఎస్‌), ఇండియా ఎనర్జీ స్టోరేజ్‌ అలయన్స్‌ (ఐఈఎస్‌ఏ) సంయుక్త నివేదిక తెలిపింది.

అప్పగించే పని మొదలైంది
ఎలక్ట్రిక్‌ వాహనాల విప్లవాన్ని రాష్ట్రంలో తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2070 నాటికి నెట్‌ జీరో ఉద్గారాలను సాధించాలనే జాతీయ లక్ష్యానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. భవిష్యత్‌లో రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం, ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ స్థలాలను గుర్తించాయి. నమోదు చేసుకున్న నిర్వాహకులకు చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు బాధ్యతలను అప్పగించే పని మొదలైంది.  
– ఎస్‌ రమణారెడ్డి, వీసీ, ఎండీ, ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ

ప్రత్యేక పాలసీ..స్థిరమైన లక్ష్యం 
ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక పాలసీని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈఎంఐ (వాయిదా)ప్రాతిపదికన లక్ష ఎలక్ట్రిక్‌ వాహనాలను పంపిణీ చేస్తోంది. రోడ్డు పన్ను, రిజి్రస్టేషన్‌ ఫీజు మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఇంధన ఖర్చులు భారంగా మారిన నేటి కాలంలో దిగువ/మధ్య తరగతి ప్రజలకు సాయపడేలా సుస్థిర రవాణాను అభివృద్ధి చేయడానికి రాష్ట్రమంతటా చార్జింగ్‌ మౌలిక సదుపాయాలను న్యూ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) ఆధ్వర్యంలో 266 ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది.

మరో 115 స్టేషన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. దీంతో రాష్ట్రంలో విద్యుత్‌ వాహనాల సంఖ్య 65,000 దాటింది. 2030 నాటికి పెట్రోల్‌ వాహనాలను దశల వారీగా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా జాతీయ రహదారుల వెంబడి 25 కి.మీ ఒకటి చొప్పున, నగర పరిధిలో ప్రతి 3 కీలోమీటర్ల గ్రిడ్‌ లోపల చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 4 వేల స్థలాలను గుర్తించింది.

Advertisement
Advertisement