మంత్రి రోజాకు మద్దుతుగా నటి మీనా.. బండారుపై సుప్రీంకోర్టు యాక్షన్‌ తీసుకోవాలని..

8 Oct, 2023 07:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి రోజాపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సహ నటీమణులు, జాతీయ­స్థాయి నేతలు, పక్క రాష్ట్రాల నేతలు రోజాకు మద్దతుగా గ­ళం విప్పుతున్నారు. ఇప్పటికే కుష్బూ, రాధిక వంటి నటీమణులు.. బండారు సత్య­నారా­యణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాజాగా నటి మీనా కూడా మంత్రి రోజాకు మద్దతుగా నిలిచారు. సత్యనారాయణ వెంటనే మంత్రి రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

తాజాగా నటి మీనా ఓ వీడియోలో మాట్లాడుతూ.. మంత్రి రోజాపై  టీడీపీ నేత బండారు నీచమైన వ్యాఖ్యలు చేశారు. బండారు తక్షణమే మంత్రి రోజాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలి. బండారు ఎంత దిగజారుడు మనస్తత్వం ఉన్నవాడో అర్థమయ్యేలా ఉన్నాయి. అతని అభద్రత భావం, అసూయకి నిదర్శనం. మంత్రి రోజా సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి నాకు తెలుసు. ఆమెతో కలిసి నటించిన వ్యక్తిగా ఆమె గురించి నాకు పూర్తిగా తెలుసు. రోజా చాలా చిత్తశుద్ధితో హార్డ్ వర్క్ చేసే దృఢమైన  మహిళ. 

రోజా నటిగా, తల్లిగా, రాజకీయ నాయకురాలిగా, మహిళగా అన్నింటిలోనూ సక్సెస్ అయిన వ్యక్తి. ఆమెపై ఇలా నీచంగా మాట్లాడితే రోజా భయపడుతుంది అనుకుంటున్నారా?. మంత్రి రోజా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడే హక్కు బండారు సత్యనారాయణకి ఎవరిచ్చారు. ఇలా మాట్లాడినంత మాత్రాన మహిళలు భయపడి పోతారు అనుకుంటున్నవా?. మంత్రి రోజా చేసే పోరాటానికి నేను అండగా ఉంటాను అని మీనా.. మంత్రి రోజాకు తన మద్దతు ప్రకటించారు.

మరిన్ని వార్తలు