కాంట్రాక్టుల కోసం రూ.కోటి లంచం

18 Jan, 2021 02:28 IST|Sakshi

రైల్వే ఉన్నతాధికారి, మరో ఇద్దరు అరెస్టు


న్యూఢిల్లీ: కాంట్రాక్టులు కట్టబెట్టే విషయంలో ప్రైవేట్‌ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించి, కోటి రూపాయలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో ఈశాన్య ఫ్రాంటియర్‌ రైల్వేస్‌కు చెందిన చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(కన్‌స్ట్రక్షన్‌) మహేందర్‌ సింగ్‌ చౌహాన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అరెస్టు చేసింది. ఇండియన్‌ రైల్వేస్‌ సర్వీస్‌ ఆఫ్‌ ఇంజనీర్‌(ఐఆర్‌ఎస్‌ఈ) 1985 బ్యాచ్‌కు చెందిన చౌహాన్‌ను అస్సాం రాజధాని గువాహటిలో అదుపులోకి తీసుకున్నారు. అలాగే లంచం చేరవేసిన ఏబీసీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉద్యోగి భూపేంద్ర రావత్, మరో వ్యక్తి ఇంద్రాసింగ్‌ను అరెస్టు చేశారు.

దీంతో సంబంధం ఉన్న రైల్వే అధికారులు హేమ్‌చంద్‌ బోరా, లక్ష్మీకాంత్‌ వర్మ, ఏబీసీఐ సంస్థ డైరెక్టర్‌ పవన్‌ బైద్‌పై కేసు నమోదు చేశారు. ఈశాన్య ఫ్రాంటియర్‌ రైల్వేస్‌ పరిధిలో పలు ప్రాజెక్టులు కట్టబెట్టేందుకు చౌహాన్‌ ఏబీసీఐ సంస్థకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. ఆయన ఆ సంస్థ నుంచి లంచం కింద రూ. కోటి వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో 60 లక్షలను సీబీఐ రికవరీ చేసినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ, ఉత్తరాఖండ్, త్రిపుర, పశ్చిమబెంగాల్, అస్సాంలో పలుచోట్ల దాడులు చేసి, రూ.54 లక్షలు స్వాధీనం చేసుకుంది. 

మరిన్ని వార్తలు