Amaravati IRR Case: చంద్రబాబు ఏ–1.. లోకేశ్‌ ఏ–14 

27 Sep, 2023 01:53 IST|Sakshi

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పుతో భూ దోపిడీ

లింగమనేనితో క్విడ్‌ప్రోకో.. హెరిటేజ్‌కు భూముల కానుక

హెరిటేజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ మీటింగ్‌లో డైరెక్టర్‌ హోదాలో తీర్మానం 

లోకేశ్‌ను నిందితుడిగా చేరుస్తూ కోర్టులో సీఐడీ మెమో దాఖలు 

లోకేశ్‌ పేరిట హెరిటేజ్‌ ఫుడ్స్‌లో 23,66,400 షేర్లు 

సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు సహకార డెయిరీలను దెబ్బతీసి తమ కుటుంబ సంస్థ హెరిటేజ్‌ ఫుడ్స్‌ వ్యాపారం, ఆస్తులను అమాంతం పెంచగా ఆయన తనయుడు లోకేశ్‌ రాజధా­నిలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు(ఐఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌ ఖరారులో అక్రమాలతో హెరిటేజ్‌ ఫుడ్స్‌ కోసం భూములను కొల్లగొట్టారు. తమ బినామీ, సన్నిహి­తుడు లింగమనేని రమేశ్‌ కుటుంబంతో క్విడ్‌ప్రో­కో­కు పాల్పడి భారీ భూదోపిడీకి తెగబడటంలో చంద్ర­బాబు, లోకేశ్‌ చక్కటి సమన్వయం కనబరిచారు. క్విడ్‌ ప్రోకో కింద చంద్రబాబు కరకట్ట నివాసాన్ని తీసుకోగా హెరిటేజ్‌ ఫుడ్స్‌ డైరెక్టర్‌ హోదాలో లోకేశ్‌ భూ­ములను కొల్లగొట్టారు.

ఈ అవినీతి భూబాగోతాన్ని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. క్విడ్‌ ప్రోకో కింద చంద్రబాబు పొందిన కరకట్ట నివాసాన్ని, నారాయణ కుటుంబ సభ్యులు సీడ్‌ క్యాపిటల్‌లో పొందిన 75,888 చ.గజాల  ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్‌ చేయాలని ఇప్పటికే  నిర్ణయించింది. ఈమేరకు న్యాయస్థానంలో పిటిషన్‌ కూడా దాఖలు చేసింది.

ఈ కేసులో ఇప్పటికే ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణను పేర్కొన్న సిట్‌ నారా లోకేశ్‌ను ఏ–14గా పేర్కొంటూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో మంగళవారం ప్రత్యేక మెమో దాఖలు చేసింది. లింగమనేని రమేశ్, రాజశేఖర్‌లతోపాటు హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థను కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. 

ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌లో అవినీతి మెలికలు..
అమరావతి ముసుగులో చంద్రబాబు సాగించిన భారీ భూదందాలో ఐఆర్‌ఆర్‌ కుంభకోణం ఓ భాగం! మాజీ మంత్రి పొంగూరు నారాయణతోపాటు లోకేశ్‌ ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు తమ బినామీ, సన్నిహితుడైన లింగమనేని రమేష్‌తో క్విడ్‌ ప్రోకోకు పాల్పడి ఆయన భూముల విలువను భారీగా పెరిగేలా చేశారు.

అందుకు ప్రతిగా బినామీల పేరిట భారీగా భూములను పొందడమే కాకుండా కరకట్ట నివాసంతోపాటు హెరిటేజ్‌ ఫుడ్స్‌కు భూములు కానుకగా దక్కించుకున్నారు. నాడు సీఆర్‌డీఏ అధికారులు రూపొందించిన 94 కి.మీ. అమరావతి ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌పై చంద్రబాబు, నారాయణ మండిపడ్డారు. ఆ అలైన్‌మెంట్‌ ప్రకారం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అమరావతిలోని పెదపరిమి, నిడమర్రు, చినవడ్లపూడి, పెదవడ్లపూడి మీదుగా వెళ్తుంది.

హెరిటేజ్‌ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి దాన్ని నిర్మించాల్సి వస్తుంది. దీంతో తమ భూముల విలువ అమాంతం పెరగదని వారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారి ఆదేశాలతో సీఆర్‌డీయే అధికారులు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేశారు. చంద్రబాబు, లింగమనేని కుటుంబానికి చెందిన వందలాది ఎకరాలున్న తాడికొండ, కంతేరు, కాజాను పరిగణలోకి తీసుకున్నారు.

అందుకోసం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ను 3 కిలోమీటర్లు దక్షిణానికి జరిపారు. హెరిటేజ్‌ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి కంతేరు, కాజాలో ఉన్న  భూములను ఆనుకుని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మించేలా 97.50 కి.మీ. అలైన్‌మెంట్‌ను రూపొందించారు. అయితే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అనంతరం సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్‌ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చి అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ డిజైన్‌ను అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో చేర్చారు.

ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించి మాస్టర్‌ ప్లాన్‌లో పొందుపరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగా ఉండాలని ఆదేశించారు. అప్పటికే సీఆర్‌డీయే అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించేలా చేశారు. ఈ క్రమంలో తాడికొండ, కంతేరు, కాజాలో హెరిటేజ్‌ ఫుడ్స్, లింగమనేని భూములను ఆనుకుని అలైన్‌మెంట్‌ను ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ఖరారు చేసింది.

హెరిటేజ్‌ ఫుడ్స్‌కు భూములు
ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ను మెలికలు తిప్పడం ద్వారా లింగమనేని కుటుంబం భూముల విలువను భారీగా పెరిగేలా చేశారు. కంతేరు, కాజాలో లింగమనేని కుటుంబానికి ఉన్న 355 ఎకరాలను ఆనుకునే  అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. అందుకు ప్రతిగా అదే ప్రాంతంలో హెరిటేజ్‌ ఫుడ్స్‌కు భూములను పొందారు. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ను ఆనుకుని కంతేరులో హెరిటేజ్‌ ఫుడ్స్‌కు 10.4 ఎకరాలు పొందగా 2014 జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్యలో కొనుగోలు చేసినట్టు చూపించారు.

లింగమనేని కుటుంబ నుంచి మరో 4.55 ఎకరాలను కొనుగోలు పేరిట హెరిటేజ్‌ ఫుడ్స్‌ దక్కించుకుంది. అప్పటికే ఈ కుంభకోణం గురించి బయటకు పొక్కడంతో ఆ సేల్‌ డీడ్‌ను రద్దు చేసుకున్నారు. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ను ఆనుకుని లింగమనేని కుటుంబానికి చెందిన 355 ఎకరాలతోపాటు హెరిటేజ్‌ ఫుడ్స్‌ భూములు ఉండటం గమనార్హం. 

లోకేశ్‌ కీలక ‘భూ’మిక
క్విడ్‌ప్రోకోకు పాల్పడి హెరిటేజ్‌ ఫుడ్స్‌కు భూములను దక్కేలా చేయడంలో లోకేశ్‌ కీలక భూమిక పోషించారు. ఆయన 2008 జూలై 1 నుంచి 2013 జూన్‌ 29 వరకు హెరిటేజ్‌ ఫుడ్స్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. అనంతరం 2017 మార్చి 31 వరకు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ను ఆనుకుని కొనుగోలు పేరిట భూములను దక్కించుకోవాలని నిర్ణయించిన హెరిటేజ్‌ ఫుడ్స్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో లోకేశ్‌ కూడా పాల్గొన్నారు.

క్విడ్‌ ప్రోకో కింద భూములను పొందే ప్రక్రియలో ఆయన కీలక భూమిక పోషించారు. లోకేశ్‌ పేరిట హెరిటేజ్‌ ఫుడ్స్‌లో 23,66,400 షేర్లు ఉన్నాయి. అంటే హెరిటేజ్‌ ఫుడ్స్‌లో లోకేశ్‌కు 10.20 శాతం వాటా ఉంది.

బాబుకు కరకట్ట నివాసం
క్విడ్‌ప్రోకోలో భాగంగా లింగమనేని రమేశ్‌ విజయవాడ వద్ద కృష్ణా కరకట్టపై ఉన్న తన బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. దీనిపై కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారాన్ని మసిపూసేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఆ బంగ్లాను అద్దెకు ఇచ్చానని లింగమనేని రమేశ్‌ బుకాయించారు. కానీ ఆయన అద్దె వసూలు చేసినట్టుగానీ, చంద్రబాబు చెల్లించినట్టుగానీ ఆదాయపన్ను వివరాల్లో లేవు.

తరువాత ఆ ఇంటిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చానని చెప్పారు. మరి చంద్రబాబు ప్రభుత్వం నుంచి హెచ్‌ఆర్‌ఏ ఎందుకు పొందారన్న ప్రశ్నకు సమాధానం లేదు. దీంతో ఆ బంగ్లాను చంద్రబాబుకు వ్యక్తిగతంగా క్విడ్‌ప్రోకో కింద ఇచ్చారని స్పష్టమైంది. లింగమనేని నుంచి కానుకగా స్వీకరించిన కరకట్ట ఇంట్లోనే చంద్రబాబు, లోకేష్‌ దర్జాగా నివసించడం గమనార్హం. 
 
పవన్‌కూ వాటా 
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కూడా ఈ అవినీతి పాపంలో పిడికెడు వాటా ఇచ్చారు. కాజాకు సమీపంలో ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌కు చేరువలో పవన్‌కల్యాణ్‌కు 2.4 ఎకరాలున్నాయి. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్లు చూపించారు. ల్యాండ్‌ పూలింగ్‌ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్‌ కల్యాణ్‌కు ఇవ్వడం గమనార్హం. 

భారీగా పెరిగిన విలువ
ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ ఖరారుకు ముందు లింగమనేని కుటుంబం ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.8 లక్షల రిజిస్టర్‌ విలువ చొప్పున విక్రయించింది. మార్కెట్‌ ధర ప్రకారమైతే ఎకరా రూ.50 లక్షలు ఉంది. అంటే ఆ భూముల మార్కెట్‌ విలువ రూ.177.50 కోట్లు. ఇక ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ ఖరారు తరువాత ఎకరం రూ.36 లక్షల రిజిస్టర్‌ విలువ చొప్పున విక్రయించింది. అంటే రిజిస్టర్‌ విలువే నాలుగున్నర రెట్లకుపైగా పెరిగింది.

మార్కెట్‌ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్‌ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్‌ క్యాపిటల్‌ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ప్రకటించారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు.

అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. ఆ ప్రకారం మార్కెట్‌ ధరను బట్టి హెరిటేజ్‌ ఫుడ్స్‌ 10.4 ఎకరాల మార్కెట్‌ విలువ రూ.5.20  కోట్ల నుంచి రూ.41.6 కోట్లకు కోట్లకు పెరిగింది. అమరావతి నిర్మాణం పూర్తయితే రూ.62.4 కోట్లకు చేరుతుందని తేలింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఒప్పందం చేసుకుని రద్దు చేసినట్టు చూపిన మరో 4.55 ఎకరాల విలువ కూడా రూ.27.3  కోట్లకు చేరుతుంది. ఇక చంద్రబాబు బినామీల పేరిట ఉన్న వందలాది ఎకరాల విలువ అమాంతం పెరిగింది.   

మరిన్ని వార్తలు