భర్త రెండో పెళ్లి.. భార్యపై వేధింపులు.. ఆ తర్వాత

20 Mar, 2021 08:22 IST|Sakshi

భర్తకు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష.. జరిమానా 

మరో ముగ్గురికి జరిమానా.. ఏడాది జైలు శిక్ష 

సాక్షి, కుషాయిగూడ: భార్య, పిల్లలు ఉండగానే మరో మహిళను వివాహం చేసుకున్న వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ శుక్రవారం మల్కాజిగిరి కోర్టు తీర్పు చెప్పింది. ఆయనతో పాటు వేధింపులకు పాల్పడ్డ వారికి జరిమానా, జైలు శిక్ష విధించింది. పోలీసుల సమాచారం మేరకు... కాప్రా భవానీనగర్‌కు చెందిన ఎల్‌.భవాని (గాయత్రి), ప్రేమ్‌కుమార్‌లకు 2002లో వివాహం జరిగింది. ప్రేమ్‌కుమార్‌ రైల్వే ఉద్యోగి. వీరికి ఇద్దరు సంతానం. ఇదిలా ఉండగా... ప్రేమ్‌కుమార్‌కు పనిచేసే చోట కవిత అనే వివాహితతో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ నేపథ్యలో ప్రేమ్‌కుమార్‌ తన భార్యను వదిలించుకునేందుకు వేధింపుల పర్వానికి తెరలేపి నిత్యం వేధించసాగాడు. భర్తతోపాటు అత్త లాకావత్‌ లత, ఆడపడుచు లాకావత్‌ అర్చన సైతం భవానీని వేధింపులకు పాల్పడేవారు. ఇదిలా ఉండగా 2014 జూలై 4న ప్రేమ్‌కుమార్, కవితలు ఎవరికీ తెలియకుండా రెండో వివాహం చేసుకున్నారు. ఆ సమయంలోనే ప్రేమ్‌కుమార్‌ అదృశ్యంపై కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో, కవిత అదృశ్యంపై మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్లలో మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయి. వివాహం అనంతరం ప్రేమ్‌కుమార్, కవిత కుషాయిగూడ పోలీస్ట్‌షన్‌కు వచ్చి ఇంటికి వెళ్లారు.

ఈ క్రమంలో 2016 మే 5న అతిగా మద్యం సేవించిన ప్రేమ్‌కుమార్‌ మొదటి భార్య లావణ్య పట్ల దురుసుగా వ్యవహరించి, బూతులు తిడుతూ చేయిచేసుకున్నాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో లావణ్య పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు రెండో వివాహం చేసుకున్న ప్రేమ్‌కుమార్, కవితతో పాటు వేధింపులకు పాల్పడ్డ లత, అర్చనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐఓ ఎస్‌ఐ నాగేశ్వర్‌రావు దర్యాప్తు చేసి కోర్టుకు తగిన ఆధారాలతో చార్జిషీట్‌ను సమర్పించారు. కేసు పూర్వాపరాలు.. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి శుక్రవారం ప్రేమ్‌కుమార్‌కు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 5,500 జరిమానా, మిగతా వారికి ఏడాది జైలు శిక్ష జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని పోలీసులు తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు