తల్లి శవం ఓ గదిలో.. చెల్లి మరో గదిలో.. దోస్తులతో ఎగ్‌ కర్రీ దావత్‌

8 Jun, 2022 18:09 IST|Sakshi
హత్య జరిగిన గది.. మృతురాలు సాధన(పాత ఫొటో)

సమాజంలో మైనర్‌ సంబంధిత నేరాలు పక్కదోవ పట్టడానికి కారణాలు అనేకం. అందునా తల్లిదండ్రుల నిఘా లేకపోవడం వల్లే జరుగుతున్నాయంటూ విమర్శించేవాళ్లు లేకపోలేదు. కానీ, తల్లిదండ్రుల మంచి మాటల్ని పెడచెవిన పెట్టడమే కాదు.. మందలిస్తే వాళ్లపై దాడులకు తెగబడుతోంది ఇప్పటి యువతరం. 

తాజాగా ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడొద్దు అన్నందుకు కన్నతల్లినే కడతేర్చాడు ఓ తనయుడు. యూపీ లక్నోలో జరిగిన ఈ దారుణం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తల్లి మందలింపుతో క్షణికావేశంలో తండ్రి తుపాకీ తీసుకుని ఘాతుకానికి పాల‍్పడ్డాడు సదరు టీనేజర్‌. అయితే ఈ ఘటనలో.. విస్తుపోయే విషయాలను పోలీసులు తాజాగా వెల్లడించారు. 

ఆదివారం అర్ధరాత్రి సమయంలో మొబైల్‌లో పబ్‌జీ ఆడుతూ కనిపించాడు సదరు మైనర్‌(16). అది చూసి పట్టరాని కోపంతో  తల్లి సాధన(40) మందలించింది. దీంతో అతనిలోనూ కోపం కట్టలు తెంచుకుంది. ఇం‍ట్లో బీరువాలో ఉన్న తన తండ్రి సర్వీస్‌ రివాల్వర్‌తో తల్లిని కాల్చేశాడు. తల్లిని చంపాక ఓ గదిలో ఆమె శవాన్ని ఉంచి తాళం వేశాడు. ఆ శబ్దానికి నిద్రిస్తున్న అతని సోదరి(10) లేచింది. భయంతో అరిచే ప్రయత్నం చేసింది. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి మరో గదిలో ఉంచి తాళం వేశాడు. 

ఆపై ఇద్దరు స్నేహితులకు ఫోన్‌ చేసి ఇంటికి పిలిపించుకున్నాడు. ఆన్‌లైన్‌లో ఎగ్‌కర్రీ, ఫుడ్‌, కూల్‌డ్రింకులు ఆర్డర్‌ చేసుకుని.. సినిమాలు చూస్తూ దోస్తులతో దావత్‌ చేసుకున్నాడు. తల్లి గురించి అతని స్నేహితులు ఆరాతీయగా.. బంధువుల ఇంటికి వెళ్లిందని కహానీ చెప్పాడు.  అలా రెండు రోజులు గడిచింది.

మృతదేహాం దుర్వాసన వస్తుండడంతో రూమ్‌ఫ్రెష్‌నర్‌ స్ప్రే చేశాడు. అయినా కూడా కుళ్లిన కంపు పొరుగిళ్లకు చేరింది. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల ఎంట్రీతో ఈ దారుణం బయటపడింది. గదిలో బంధించడంతో స్పృహ కోల్పోయిన మృతురాలి కూతురిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి బాగానే ఉంది. ఇదిలా ఉంటే.. ఆ కుర్రాడి తండ్రి ఆర్మీ అధికారి. ప్రస్తుతం బెంగాల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే సర్వీస్‌ రివాల్వర్‌ను మాత్రం ఇంట్లోనే ఉంచి వెళ్లారాయన.

చదవండి: గేమ్‌ ఆడొద్దు బిడ్డా అంటే..

మరిన్ని వార్తలు