డేటింగ్‌ ఫ్రెండ్‌: ఆ పదాలు యూట్యూబ్‌లో సెర్చ్‌

18 Feb, 2021 08:19 IST|Sakshi
పోలీసులు అరెస్టు చేసిన నిందితులు 

అందులో కనిపించిన ఆర్‌ఏ యాప్‌

ఏడాదిన్నర పాటు ప్రాక్టీస్‌ చేసిన వైనం 

విచారణలో గుర్తించిన సైబర్‌ క్రైమ్‌ కాప్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌: డేటింగ్‌ పేరుతో నగరానికి చెందిన యువకుడిని ట్రాప్‌ చేసి, అతడి ఖాతా నుంచి రూ.11.36 లక్షలు కాజేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేశవను విచారించగా  ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇతడితో సహా ముగ్గురు నిందితుల్ని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గత వారం అరెస్టు చేశారు. న్యాయస్థానం అనుమతితో వీరికి కస్టడీలోకి తీసుకుని విచారణ చేశారు. ఈ కేసులో నంద్యాలకు చెందిన సోఫియా అనే యువతి కోసం గాలిస్తున్నారు.  

► మెదక్‌ జిల్లా జిన్నారంలో ఉండే కేశవ డిగ్రీ రెండో సంవత్సరంలో చదువు మానేశాడు. 2018లో ఇంట్లోంచి వెళ్లిపోయాడు. బెంగళూరులో క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తున్న మేనమామ హరిప్రసాద్‌ వద్దకు చేరాడు. ఓ కేటరింగ్‌ సంస్థలో రోజుకు రూ.300 జీతానికి కుదిరాడు. ఈ ఆదాయం సరిపోకపోవడంతో తేలిగ్గా డబ్బు సంపాదించాలనుకున్నాడు.  
► యూట్యూబ్‌లో ‘హౌ టు ఎర్న్‌ ఈజీ మనీ’ సెర్చ్‌ చేసిన కేశవ.. దాదాపు 10 వేల వీడియోలను పరిశీలించాడు. వాటి నుంచి రిమోట్‌ అసిస్టెంట్‌ యాప్‌ను ఎంచుకుని వివరాలు తెలుసుకున్నాడు. తన స్మార్ట్‌ ఫోన్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. ఏడాదిపాటు ప్రాక్టీస్‌ చేశాడు.  
► ఈ యాప్‌ను వినియోగించి ఎలా మోసాలు చేయాలనేది కూడా యూ ట్యూబ్‌లో ఉంది. దీని కోసం ఓ సెల్‌ఫోన్‌లో ఫోర్న్‌ వీడియోలు ప్లే చేస్తూ లేదా ఓ యువతితో మాట్లాడిస్తూ.. మరో సెల్‌ఫోన్‌ నుంచి ఎంపిక చేసిన టార్గెట్‌కు ఫోన్‌ చేయాల్సి ఉంటుంది. రెండో ఫోన్‌ బ్యాక్‌ కెమెరాను మొదటి ఫోన్‌ స్రీన్‌కు సరిగా సరిపోయేలా చేసి సదరు యువతే మాట్లాడుతున్న భ్రమ కలిగించేవాడు.   
► ఈ సైబర్‌ క్రైమ్‌ విధానాన్ని మేనమామ హరిప్రసాద్‌కు చెప్పడంతో ఇద్దరూ కలిసి రంగంలోకి దిగారు. దీనికి అవసరమైన సిమ్‌ కార్డుల్ని బోగస్‌ వివరాలతో బెంగళూరులోని మెజిస్టిక్‌ రైల్వేస్టేషన్‌ వద్ద వీటిని విక్రయించే అన్భురాజ్‌ నుంచి పొందారు. 
► గత ఏడాది రంగంలోకి దిగిన కేశవ తమకు సహకరించడానికి బిగో యాప్‌ ద్వారా పరిచయమైన నంద్యాలకు చెందిన సోఫియా అనే యువతితో ఒప్పందం కుదుర్చుకున్నాడు.   పెద్ద సంఖ్యలో యువతుల ఫొటోలు, వివరాలతో ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేశాడు. వీటి నుంచి అనేక మందికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపేవాడు. 
► ఇలా పలువురి బ్యాకింగ్‌ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ సంగ్రహించి అదను చూసుకుని ఖాతాల్లోని డబ్బులు ఖాళీ చేసేవాడు. ఇలా ఈ గ్యాంగ్‌ హైదరాబాద్, సైబరాబాద్, తిరుపతిల్లో ముగ్గురి నుంచి రూ.20 లక్షలు కాజేసింది.  
► సిటీలో కేసు దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్‌ జి.వెంకట్రామిరెడ్డి నేతృత్వంలోని బృందం కేశవ, హరిప్రసాద్, అన్బురాజ్‌లను అరెస్టు చేసింది. 

 చదవండి: మహిళకు ఉరిశిక్ష.. దేశంలో తొలిసారి

మరిన్ని వార్తలు