ఫ్రీజ్‌ చేసిన అకౌంట్లలో రూ.100 కోట్లు 

7 Oct, 2023 04:06 IST|Sakshi

ఆలస్యమైతే నగదు చేతులు మారే అవకాశం 

త్వరగా 1930 కాల్‌ సెంటర్‌కు  ఫిర్యాదు చేస్తేనే బ్యాంక్‌ అకౌంట్లు బ్లాక్‌  

సైబర్‌ క్రైం బ్యూరో ఎస్పీ విశ్వజిత్‌ కంభంపాటి  

సైబర్‌ క్రైం బాధితులకు రికవరీ నగదు అందజేత 

44 కేసుల్లో రూ.2,23,89,575 రికవరీ 

గచ్చిబౌలి : రాష్ట్రవాప్తంగా సైబర్‌ క్రైం పై వచ్చిన ఫిర్యాదులతో ఫ్రీజ్‌ చేసిన బ్యాంక్‌ అకౌంట్లలో రూ.100 కోట్లు ఉన్నాయని, వాటిని త్వరలోనే బాధితులకు అందజేస్తామని సైబర్‌ క్రైం బ్యూరో ఎస్పీ విశ్వజిత్‌ కంభంపాటి తెలిపారు. శుక్రవారం సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సైబర్‌క్రైం బాధితులకు రికవరీ నగదును సీపీ స్టీఫెన్‌ రవీంద్ర చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విశ్వజిత్‌ మాట్లాడుతూ సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. త్వరగా ఫిర్యాదు చేస్తే ఆ నగదు వెళ్లిన అకౌంట్‌ను బ్లాక్‌ చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామన్నారు. ఆలస్యమైతే నగదు చేతులు మారే అవకాశం ఉందన్నారు. దీంతో బాధితులు నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు.

సైబర్‌ నేరగాళ్లు భారీ మొత్తంలో నగదును తీసుకున్నప్పుడు ఆలస్యం అయితే క్రిప్టో కరెన్సీకి మళ్లించే అవకాశం ఉందన్నారు. అలా చేసిన తరువాత రికవరీ చేసే వీలుండదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సైబర్‌ క్రైం ఫిర్యాదులతో ఫ్రీజ్‌ చేసిన బ్యాంక్‌ అకౌంట్లలో రూ.100 కోట్ల నగదు ఉందని, అన్ని జిల్లాల పోలీసు అధికారులకు సమాచారం అందించామని, త్వరలోనే బాధితులకు అందజేయనున్నట్లు తెలిపారు. డబ్బులు ఇస్తామని ఎరవేసి పాస్‌ బుక్, డెబిట్‌ కార్డు, లింక్‌ చేసిన ఫోన్‌ నెంబర్‌ తీసుకుని వేరే అకౌంట్లు తెరచి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారని, అలా సహకరించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. సైబరాబాద్‌ డీసీపీ క్రైమ్స్‌ కల్మేశ్వర్‌ సింగన్వార్‌ మాట్లాడుతూ పెట్టుబడి పేరిట మోసాలకు పాల్పడిన కేసులే ఎక్కువగా ఉన్నాయన్నారు.

ఆన్‌లైన్‌ వెబ్‌సైట్స్, మెసెంజర్, సోషల్‌ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మవద్దని సూచించారు. ఇన్వెస్ట్‌మెంట్‌ పేరిట మొదట  అదనంగా కొంత కలిపి ఇచ్చి నమ్మకం కలిగిస్తారని తెలిపారు. ఎక్కువ మొత్తంలో డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయగానే కంటాక్ట్‌లో లేకుండా పోతారని వివరించారు. సైబర్‌ నేరాలపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మూడు, నాలుగు నెలలు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించినట్లు తెలిపారు. 44 కేసుల్లో రూ.2,23,89,575 రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. 1930 కాల్‌ సెంటర్‌ కేవలం ఫిర్యాదును మాత్రమే స్వీకరిస్తారని ఆ తర్వా కేసు ఏ పోలీస్‌ స్టేషన్‌కు కేటాయిస్తారో మెసేజ్‌ వస్తుందన్నారు. కేసు స్టేటస్‌ను ఆయా పోలీస్‌ స్టేషన్లలోనే అడగాలని సూచించారు.  కార్యక్రమంలో సైబర్‌ క్రైం డీసీపీ రితిరాజ్, ఏసీపీ, సీఐలు పాల్గొన్నారు. 

డ్రగ్స్‌ పేరిట బ్లాక్‌ మెయిల్‌ 
మీరు తైవాన్‌కు పంపుతున్న ఫెడెక్స్‌ ఫార్సిల్‌లో డ్రగ్స్‌ ఉన్నాయి. ఫోన్‌ నెంబర్, ఆధార్‌కార్డు వివరాలతో మీ కు ఫోన్‌ చేశాం. మేము సీబీఐ అధికారులం మీ పై కేసు నమోదవుతుందని ఓ మహిళను బెదిరించి రూ.10.96 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సదరు అకౌంట్‌ను ఫ్రీజ్‌ చేసిన పోలీసులు మొత్తం నగదును రికవరీ చేసి బాధితురాలికి అందజేశారు. 

పెట్టుబడి పేరిట మోసం  
గాజుల రామారం ప్రాంతానికి చెందిన యువకుడు మొబైల్‌ షాపు నిర్వహిస్తున్నాడు. మెసేంజర్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రకటనలు చూసిన అతను మొదట రూ.1000 పంపిస్తే వెంటనే రూ.1200 వచ్చాయి. రెండో సారి రూ.9,900 పంపిస్తే రూ.12600 పంపారు. అనుమానం వచ్చి యువకుడు స్పందించకుంటే వీడియో కాల్స్‌ చేసి మరింత ఆశ చూపడంతో అప్పు చేసి రూ.2.92,600 పంపాడు. వెంటనే అటువైపు నుంచి ఎలాంటి స్పందనలేకపోవడం మోసపోయినట్లు గుర్తించి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రూ.1,50,000 రికవరీ చేసి అతడికి అందజేశారు. 

మరిన్ని వార్తలు