Warangal NIT: నిట్‌లో లైంగిక వేధింపులు.. మహిళా సెక్యూరిటీ గార్డులకు వాట్సాప్‌ మెసెజ్‌లు పంపుతూ...

26 Aug, 2022 20:10 IST|Sakshi
వేధింపులకు పాల్పడిన డిప్యూటీ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరన్‌

సాక్షి, వరంగల్‌: అతని లైంగి కవేధింపులకు విసిగివేసారిన మహిళా సెక్యూరిటీ గార్డులు చివరికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిన నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. వెంకటేశ్వరన్‌ పది నెలల క్రితం క్యాంపస్‌కు డిప్యూటీ రిజిస్ట్రార్‌గా అడ్మిన్‌ హోదాలో వచ్చాడు. క్యాంపస్‌లో పనిచేస్తున్న మహిళా సెక్యూరిటీ గార్డులను ఒంటరిగా తన ఇంటికి పిలిపించుకుని వ్యక్తిగత పనులు చేయాలంటూ కొన్నిరోజులుగా వేధిస్తున్నాడు.

వాట్సాప్‌ మెసెజ్‌లు పంపుతూ లైంగికంగా వేధిస్తున్నాడు. చెప్పిన పని ఒప్పుకోకపోతే గంజాయి కేసు పెడతా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం వెంకటేశ్వరన్‌.. ప్రశాంత్‌నగర్‌లోని తన ఇంటికి ఇద్దరు మహిళా సెక్యూరిటీ గార్డులను ఒకరికి తెలియకుండా మరొకరిని పిలిపించాడు. అసభ్యకరంగా మాట్లాడుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.  దీంతో గార్డులు డిప్యూటీ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరన్‌కు దేహశుద్ధి చేసి కాజీపేట పోలీసులకు అప్పగించారు. ముందుగానే ఈ విషయాన్ని రిజిస్ట్రార్‌ గోవర్ధన్‌రావుకు తెలిపినా పట్టించుకోలేదని బాధితులు తెలిపారు.

నిట్‌ వరంగల్‌ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్, ఎస్‌ఐఎస్‌ సంస్ధ యజమాని డిప్యూటీ రిజిస్ట్రార్‌తో కుమ్మక్కై మహిళా సెక్యూరిటీ గార్డులను తన ఇంటికి పంపించే విధులు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల్లో ఒకరి ఫిర్యాదు మేరకు డిప్యూటీ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరన్, చీఫ్‌ సె క్యూరిటీ ఆఫీసర్‌ కుమారస్వామి, ఎస్‌ఐఎస్‌ సెక్యూరిటీ సంస్థ శంకరన్‌లపై కేసు నమోదు చేసినట్లు కాజీపేట ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. కాగా, గతంలో తమిళనాడులో తాను పనిచేసిన సంస్థలోనూ వెంకటేశ్వరన్‌ ఇదే తరహాలో లైంగిక వేధింపులకు పాల్పడడంతో అక్కడినుంచి నిట్‌ వరంగల్‌కు మకాం మార్చినట్లు విశ్వసనీయ సమాచారం.
చదవండి:పిజ్జా డెలివరీ బాయ్‌ ప్రాణాలమీదకు తెచ్చిన రూ.200 చిరిగిన నోటు

మరిన్ని వార్తలు