వివేకా హత్యతో నాకు సంబంధం లేదు

19 Nov, 2021 03:50 IST|Sakshi
ఫైల్ ఫోటో

సీబీఐ డైరెక్టర్‌కు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి లేఖ

వివేకా మృతి తరువాత ఆయన భార్య, కుమార్తె, అల్లుడు, బావమరిది తీరు సందేహాస్పదంగా ఉంది

చంద్రబాబు సమక్షంలోనే వివేకా హత్యకు కుట్ర జరిగి ఉండొచ్చు

దర్యాప్తును ప్రభావితం చేసేందుకు సునీత యత్నిస్తున్నారు

వివేకా రాసినట్టుగా చెబుతున్న లేఖ, సెల్‌ఫోన్‌ను పోలీసులకు వెంటనే ఎందుకు స్వాధీనం చేయలేదు?

ఎవరి ఆదేశాలతో రక్తపు మరకలు తుడవాలని గంగిరెడ్డి ఆదేశించారు?

మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, ఏబీ కలిసే పన్నాగం పన్ని ఉండొచ్చు  

సాక్షి, అమరావతి/కడప అర్బన్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యతో తనకు సంబంధం లేదని, తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించారని వైఎస్సార్‌సీపీ నాయకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సీబీఐ డైరెక్టర్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. హత్య అనంతరం వివేకా కుటుంబ సభ్యుల తీరు సందేహాస్పదంగా ఉందని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ నేతలు వివేకా హత్యకు కుట్ర పన్ని ఉండవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు. హత్య వెనుక వాస్తవాలను, అసలు కుట్రను వెలికితీసేందుకు వివేకా కుటుంబ సభ్యులను, చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలను విచారించాలని కోరారు. వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి స్టేట్‌మెంట్‌ ఆధారంగా కొన్ని మీడియా సంస్థలు తాను కూడా ఈ కుట్రలో భాగస్వామిని అని చర్చలు నిర్వహిస్తుండటం తన దృష్టికి వచ్చిందన్నారు. హత్య కేసులో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కింది అంశాలపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని సీబీఐ డైరెక్టర్‌ను కోరారు. లేఖలోని ముఖ్యాంశాలు..

నన్ను చిత్రహింసలు పెట్టారు
ఈ హత్య కేసులో మొదట స్థానిక పోలీసులు, అనంతరం అప్పటి టీడీపీ ప్రభుత్వం నియమించిన సిట్‌ దర్యాప్తు చేపట్టిందన్నారు. సిట్‌ 2019 మార్చిలో వారం పాటు తనను విచారణ పేరుతో దారుణంగా చిత్రహింసలకు గురిచేసిందని తెలిపారు. అనంతరం దర్యాప్తు చేపట్టిన సీబీఐ మూడుసార్లు విచారించిందని,  ప్రతిసారీ పూర్తిగా సహకరిస్తూనే ఉన్నానని తెలిపారు.

దర్యాప్తును తప్పుదోవ పట్టించిన సునీత
వైఎస్‌ సునీత మొదటి నుంచి వేరే ఉద్దేశాలతో ప్రకటనలు చేస్తూ, దర్యాప్తు అధికారులకు పిటిషన్లు ఇస్తూ దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తూ అమాయకులను వేధించారు. ఓ వర్గం మీడియా కూడా ప్రత్యర్థులను వేధించేందుకు సునీతను అడ్డుపెట్టుకుంది. ఆంధ్రజ్యోతి ఏబీఎన్‌ చానల్‌ యజమాని వేమూరి రాధాకృష్ణను సునీత కలవడం ప్రస్తావించాల్సిన అంశం. ఆ పత్రిక, చానల్‌ మా పార్టీకి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తూ ఉంటాయి. సునీత ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరిస్తున్నారని ఇవన్నీ రుజువు చేస్తున్నాయి. సౌభాగ్యమ్మ వారానికి మూడుసార్లు సీబీఐ అధికారులను కలవడం దర్యాప్తును ప్రభావితం చేయడమే. సునీత భర్త రాజశేఖరరెడ్డి, సీబీఐ అధికారులు కుమ్మక్కై దస్తగిరికి ఓ న్యాయవాదిని నియమించి ఐదు రోజుల్లోనే ముందస్తు బెయిల్‌ వచ్చేలా చేశారు. తండ్రిని హత్య చేసిన దస్తగిరికి సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి ఎందుకు మద్దతిస్తున్నారో విచారించాలి. హత్యకు కొన్ని రోజుల ముందే శివప్రకాశ్‌ రెడ్డి 20 నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌ పేపర్లు ఎందుకు కొన్నారో విచారించాలి.

వివేకా సెల్‌ఫోన్‌ను వెంటనే ఎందుకు పోలీసులకు ఇవ్వలేదు?
వివేకానందరెడ్డి పులివెందులలో ఆయన ఇంట్లో మృతిచెందినట్లు 2019, మార్చి 15న ఉదయం గుర్తించారు. ఆయన పీఏ మూలి వెంకట కృష్ణారెడ్డి, వంట మనిషి కుమారుడు ప్రకాశ్‌ ఇంట్లోకి వెళ్లి చూడగా బాత్రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉన్నారు. అక్కడ ఆయన రాసినట్టుగా ఉన్న ఓ లేఖ, సెల్‌ఫోన్‌ను వెంకట కృష్ణారెడ్డి స్వాధీనం చేసుకున్నారు. వాటి విషయాన్ని అక్కడే ఉన్న బంధుమిత్రులకుగానీ పోలీసులకు గానీ చెప్పలేదు. హైదరాబాద్‌లో ఉన్న వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, పెద్ద బావమరిది ఎన్‌.శివప్రకాశ్‌రెడ్డి, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డికి ఫోన్‌ చేసి చెప్పారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పులివెందుల చేరుకున్న కుటుంబ సభ్యులు సాయంత్రం వరకు వాటి విషయాన్ని గోప్యంగా ఉంచారు. సునీత సాయంత్రం 4.30 గంటలకు లేఖను పోలీసులకు ఇవ్వగా.. కృష్ణారెడ్డి సెల్‌ఫోన్‌ను సాయంత్రం 5.30 గంటలకు ఇచ్చారు. కృష్ణారెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన సునీత ఆ లేఖ, సెల్‌ఫోన్‌ను వెంటనే పోలీసులకు ఇవ్వాలని కృష్ణారెడ్డికి చెప్పాలి. కానీ వారు పులివెందులకు చేరుకునే వరకు ఇవ్వొద్దని చెప్పారు. కీలక ఆధారాలను పోలీసులకు వెంటనే అప్పగించకపోవడం వెనుక కారణాలపై దర్యాప్తు చేయాలి. సెల్‌ఫోన్‌ను ట్యాంపర్‌ చేయడానికి, డాటాను డిలీట్‌ చేయడానికి పూర్తి అవకాశాలున్నాయి.

రక్తపు మరకలు తుడిపించింది గంగిరెడ్డే
వివేకానందరెడ్డి గుండెపోటుకు గురై బాత్రూమ్‌ కమోడ్‌పై పడి చనిపోయారని ఆయన కుటుంబ సభ్యులే భావించారు. హత్య జరిగిన రోజు నేను మరికొందరితో కలిసి జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారం కోసం  వెళ్తుండగా వివేకా బావమరిది శివప్రకాశ్‌ రెడ్డి ఫోన్‌ చేసి ఈ విషయాన్ని చెప్పారు. వెంటనే మేమంతా వివేకా ఇంటికి వెళ్లేసరికే కృష్ణారెడ్డి, ఇనయతుల్లా, రంగయ్య, వంట మనిషి లక్ష్మమ్మ, ఆమె కుమారుడు ప్రకాశ్‌ ఉన్నారు. బాత్రూమ్‌లో వివేకా మృత దేహాన్ని చూసిన వెంటనే బయటకు వచ్చేశా. సీఐ శంకరయ్య, అధికారులు, బంధుమిత్రులు, ఎర్ర గంగిరెడ్డి వచ్చారు. గంగిరెడ్డి అక్కడి వ్యవహారాలను తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. మృతదేహాన్ని బాత్రూమ్‌ నుంచి బయటకు తేవాలని ఇనయతుల్లాకు, రక్తపు మడుగుగా మారిన ఇంటిని శుభ్రం చేయాలని లక్ష్మమ్మకు చెప్పారు. లేఖ, సెల్‌ఫోన్‌లను ఉదయమే పోలీసులకు ఇచ్చి ఉంటే రక్తపు మరకలు శుభ్రం చేయకుండా పోలీసులు అడ్డుకుని ఉండేవారు. గంగిరెడ్డి ఎవరి ఆదేశాలతో రక్తపు మరకలు తుడిపించారు? ఎవరి ఆదేశాలతో ఇనయతుల్లా ఫొటోలు, వీడియోలు తీశారు? వాటిని కుటుంబ సభ్యులకు ఎందుకు పంపారు? వివేకా ఎలా చనిపోయారో తెలిసినప్పటికీ అనుమానాస్పద మృతి అని ఎవరి ఆదేశాలతో కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారో తేల్చాలి.

గుండెపోటుతో మరణించారని ఆదినారాయణరెడ్డి ఎలా చెప్పారు?
వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని, శివప్రకాశ్‌రెడ్డి ఈ విషయాన్ని చెప్పారని అప్పటి టీడీపీ మంత్రి ఆది నారాయణరెడ్డి మీడియాకు ఎలా చెప్పారు? వివేకానందరెడ్డి ఇంట్లో పరిస్థితి గురించి సునీత, రాజశేఖరరెడ్డి, శివ ప్రకాశ్‌రెడ్డిలకు పూర్తిగా తెలుసు. కృష్ణారెడ్డితో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. మృతదేహం ఫొటోలను ఇనయతుల్లా వాట్సాప్‌ చేశారు. వివేకానందరెడ్డి శరీరంపై తీవ్ర గాయాలున్నాయని డాక్టర్‌ నాయక్‌ వారికి చెప్పారు. అయినా గుండెపోటుతో మృతిచెందారని శివప్రకాశ్‌రెడ్డి మంత్రికి ఎందుకు చెప్పారు? వీరందరూ కొన్ని విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు. వాస్తవాలను వెలికి తీసేందుకు వారే కీలకం.

వివేకా హత్య వెనుక చంద్రబాబు, టీడీపీ కుట్ర ఉండొచ్చు..
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డిని హత్య చేశారు. కడప, పులివెందుల నియోజకవర్గాలు వైఎస్సార్‌ కుటుంబానికి పెట్టని కోటలు. కడపలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉండటంలో వివేకా కీలకంగా ఉన్నారు. ఆయన ఉండటం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి రాజకీయ జీవితానికి ప్రమాదకరం. ఆయన్ని అడ్డు తొలగిస్తే తప్ప పట్టు సాధించలేమని భావించారు. హత్యకు రెండు వారాల ముందు బీటెక్‌ రవి, ఆదినారాయణరెడ్డి, మరికొందరు అప్పటి సీఎం చంద్రబాబును ఆయన క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు. ఆయన సూచనల మేరకు మళ్లీ విజయవాడలో ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. అనంతరం అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును ఆయన కార్యాలయంలో కలిశారు. అప్పుడే కుట్ర జరిగి ఉండొచ్చు. హత్యకు ఒకరోజు ముందు పరమేశ్వరరెడ్డి ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రివర్గాలకు చెప్పకుండా బయటకు వచ్చి బీటెక్‌ రవి, మరికొందరిని కడపలోని హరితా హోటల్‌లో కలిశారు. వీరంతా ఎన్నో ఫ్యాక్షన్‌ హత్యల్లో పాల్గొన్నారు. వివేకాను అడ్డు తొలగించుకోవడం టీడీపీకి ఎన్నికల్లో కలసివచ్చే అంశం. చంద్రబాబు, టీడీపీ నేతలు ఈ హత్యను 2019 ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు కూడా. వివేకానందరెడ్డికి ముప్పు ఉందని తెలిసినప్పటికీ ఆయనకు గన్‌మెన్‌ను టీడీపీ ప్రభుత్వం తొలగించింది. కుట్రతోనే ఇలా చేశారా అన్న విషయంపై దర్యాప్తు జరగాలి. 

వైఎస్‌ వివేకా హత్యకేసులో శివశంకర్‌రెడ్డి అరెస్ట్‌
కడప అర్బన్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ అధికారులు పులివెందులకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని బుధవారం హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి సీబీఐ కోర్టు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. అనంతరం ట్రాన్సిట్‌ వారెంట్‌ ద్వారా గురువారం కడప కేంద్రకారాగారంలోని గెస్ట్‌హౌస్‌కు తీసుకొచ్చారు. కడప రిమ్స్‌లోని ప్రభుత్వ దంతవైద్య కళాశాలలో కోవిడ్‌–19 పరీక్షలు చేయించిన తరువాత శివశంకర్‌రెడ్డిని పులివెందుల కోర్టులో హాజరుపరచగా డిసెంబర్‌ 2 వరకు రిమాండ్‌ విధిస్తూ మేజిస్ట్రేట్‌ ఆదేశించారు. దీంతో కడప కేంద్రకారాగారానికి తరలించారు. శివశంకర్‌రెడ్డిని విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో పిటిషన్‌ వేశారు.

శంకర్‌రెడ్డి అనారోగ్యంతో ఉన్నారు
కడప అర్బన్‌: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టు చేసిన శివశంకర్‌రెడ్డి అనారోగ్యంతో ఉన్నారని ఆయన కుమారుడు చైతన్య రెడ్డి సీబీఐకి తెలిపారు. ఆయనకు ఈనెల 15న ఎడమ భుజానికి శస్త్ర చికిత్స జరిగిందని, ఇంకా వైద్యం పొందాల్సిన అవసరం ఉందని సీబీఐకి లేఖ రాశారు. వివేకానందరెడ్డి హత్యలో తన తండ్రి పాత్ర లేదని, కేవలం ఆరోపణలతోనే సీబీఐ అధికారులు ఆయన్ని అరెస్ట్‌ చేశారని తెలిపారు. శివ శంర్‌రెడ్డిని ఈ నెల 17న హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో చైతన్య రెడ్డి సీబీఐకి లేఖ రాస్తూ తన తండ్రికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.  

మరిన్ని వార్తలు