కార్ల చోరికి అలవాటు పడ్డ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌! అద్దెకు తీసుకుని అమ్మేస్తాడు

12 Feb, 2022 10:27 IST|Sakshi

లింగోజిగూడ: నకిలీ పత్రాలతో కార్లను అద్దెకు తీసుకుని నంబర్‌ ప్లేట్లు మార్చి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను చైతన్యపురి పోలీసులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం ఎల్‌బీనగర్‌ సీపీ క్యాంప్‌ కార్యాలయంలో రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. భీమవరానికి చెందిన గుడాటి మహేష్‌ నూతన్‌ కుమార్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. భీమవరంలోనే మొబైల్‌ మెకానిక్‌గా పని చేసేవాడు.

జల్సాలకు అలవాటు పడిన అతను సెల్‌ ఫోన్‌లను చోరీ చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత హైదరాబాద్‌ మకాం మార్చిన అతను స్నేహితుల గదుల్లో ఉంటున్నాడు. వారి గుర్తింపు కార్డులను తీసుకోవడంతో పాటు డ్రైవర్లు కావాలంటూ ప్రకటనలు ఇచ్చేవాడు. తనను సంప్రదించిన వారి గుర్తింపు కార్డుల జిరాక్స్‌ తీసుకునే వాడు. వాటితో వివిధ కారు రెంటల్‌  అన్‌లైన్‌ యాప్‌లలో కార్లను బుక్‌ చేసుకునే వాడు. ఆ తర్వాత వాటికి జీపీఎస్‌ ట్రాక్‌ సిస్టం తొలగించి రాష్ట్రం దాటిన తర్వాత నంబర్‌ ప్లేట్లను మార్చేవాడు. సదరు కారును కొద్ది రోజులు వాడుకుని తక్కువ ధరకు విక్రయించేవాడు.

గత సంవత్సరం చైతన్యపురి పోలీస్టేషన్‌ పరిధిలో క్రెటా కారును చోరీ చేశాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా  మహేష్‌ను నిందితుడిగా గుర్తించి అతడిని అరెస్ట్‌ చేశారు. అతడికి సహకరిస్తున్న   షేక్‌ మున్వార్‌ అలియాజ్‌ మున్న, కొండ సాయి మదన్‌లను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ముఠా చెన్నై, బెంగుళూరు, కేరళ, పుణేలలో కార్ల చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.పోలీసులు నుంచి 5కార్లు, ఒక బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్, ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, చైతన్నపురి సీఐ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు