ఈ డాక్టర్‌ టెన్త్‌ ఫెయిల్‌.. భారీగా ఫీజులు.. రోగం ముదిరిందంటే చాలు..

22 Nov, 2022 08:12 IST|Sakshi

స్టేషన్‌ఘన్‌పూర్‌: కనీసం పదో తరగతి కూడా పాస్‌ కాలేదు. కానీ ఏకంగా పదేళ్లుగా క్లినిక్‌ నిర్వహిస్తున్నాడొక దొంగ వైద్యుడు. ఎట్టకేలకు వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం ఈ నకిలీ వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ వైభవ్‌గైక్వాడ్, ఘన్‌పూర్‌ సీఐ రాఘవేందర్‌ తెలిపిన వివరాలివి. జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం శివునిపల్లిలో ఆకాష్‌కుమార్‌ బిశ్వాస్‌ గతంలో తన తాత (ఈయన స్థానికంగా వైద్యం చేసేవాడు) వద్ద సహాయకుడిగా పనిచేశాడు.

ఆ తరువాత డాక్టర్‌గా చలామణి అయి డబ్బులు సంపాందించాలనే ఆశతో అదే గ్రామంలో ప్రియాంక క్లినిక్‌ పేరిట ఆస్పత్రిని ఏర్పాటు చేశాడు. వైద్యశాలను నిర్వహిస్తూ తనవద్దకు సాధారణ రోగాలతో వచ్చేవారికి చికిత్స చేస్తూ పెద్ద మొత్తంలో ఫీజుల రూపంలో వసూలు చేసేవాడు. పైల్స్, ఫిషర్, బ్లీడింగ్‌ పైల్స్, పిస్టులా, బుడ్డ తదితర రోగాలకు ఆపరేషన్‌ లేకుండా వైద్యం చేస్తానని చెబుతూ పదేళ్లుగా ఆస్పత్రిని నిర్వహిస్తున్నాడు. ఒకవేళ రోగుల వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే హనుమకొండ, వరంగల్‌ నగరాల్లోని కార్పొరేట్‌ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లకు వెళ్లమని సూచించేవాడు. సదరు ఆస్పత్రుల నుంచి సైతం పెద్దమొత్తంలో కమీషన్లు తీసుకునేవాడు.

నకిలీ డాక్టర్‌ బాగోతంపై విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం వరంగల్‌ టాస్‌్కఫోర్స్, స్థానిక పోలీసులు, ఘన్‌పూర్‌ పీహెచ్‌సీ వైద్యులు దాడి చేశారు. ఆస్పత్రిలో సోదాలు నిర్వహించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో నకిలీ డాక్టర్‌గా నిర్ధారించారు. ఆస్పత్రిని మూసివేయడంతో పాటు పరికరాలు, మందులు, రికార్డులు, నిందితుడి పేరిట ఉన్న విజిటింగ్‌ కార్డులను స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. దాడుల్లో టాస్‌్కఫోర్స్‌ ఏసీపీ డాక్టర్‌ జితేందర్‌రెడ్డి, నరే‹Ùకుమార్, వెంకటేశ్వర్లు, ఇన్‌స్పెక్టర్‌ లవన్‌కుమార్‌ పాల్గొన్నారు.
చదవండి: ఉబర్‌లో కారు బుక్ చేసుకొని వెళ్లి బ్యాంకు దోచేశాడు.. కానీ చివరకు..

మరిన్ని వార్తలు