వివాహేతర సంబంధం ‘పంచాయితీ’తో కుటుంబం ఆత్మహత్య

2 Aug, 2021 08:25 IST|Sakshi
నదిలో మృతదేహం.. రోదిస్తున్న కుటుంబసభ్యులు

అవమానం.. ఆయువు తీసింది

అదృశ్యమైన కుటుంబం ఆత్మహత్య

పిల్లలు సహా గోదావరిలో దూకిన దంపతులు

ఇద్దరి మృతదేహాలు లభ్యం

కానరాని మరో ఇద్దరి ఆచూకీ

కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు

మామిడికుదురు: ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టి నలుగురి ఆత్మహత్యకు కారణమైంది. అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులు సహా ఆ దంపతులను సామూహిక ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించింది. చించినాడ బ్రిడ్జిపై నుంచి శుక్రవారం రాత్రి వశిష్ట గోదావరి నదిలో దూకినట్టుగా భావించిన నలుగురిలో ఆదివారం ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటనలో మొగలికుదురుకు చెందిన కంచి సతీశ్‌ (32)తో పాటు అతని కుమార్తె ఇందు శ్రీదుర్గ (2) మృతదేహాలను వశిష్ట నదిలో గుర్తించారు. సతీశ్‌ భార్య సంధ్య (22)తో పాటు వారి కుమారుడు జస్వన్‌ (4) మృతదేహాల కోసం గాలిస్తున్నారు.

మొగలికుదురులో తాపీ పని చేసుకుంటూ జీవించే సతీష్‌ మరికాస్త సంపాదించుకొని తమ బతుకురాత మార్చుకోవాలని కలలుగన్నాడు. ఈ క్రమంలో మెరుగైన ఉపాధి కోసం సౌదీ వెళ్లాడు. ఆ సమయంలో అతడి భార్య సంధ్యకు సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలేనికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడటం ఆ కుటుంబంలో చిచ్చు రేపింది. దీనిపై పెద్దల సమక్షంలో పంచాయితీ అయ్యింది. కుల పెద్దల సమక్షంలో రాజీ యత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కుటుంబ పెద్దలు పిల్లలు జస్వన్, శ్రీదుర్గలను మొగలికుదురులోనే ఉంచి, సంధ్యను ఆమె పుట్టిల్లయిన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు పంపించినట్టు చెబుతున్నారు.

విషయం తెలిసి మనస్తాపం చెందిన సతీష్‌ పది రోజుల కిందట సౌదీ నుంచి స్వగ్రామం వచ్చాడు. మద్యానికి బానిసైన అతడిని కుటుంబ పెద్దలు ఓదార్చారు. పిల్లలతో సహా కేశవదాసుపాలెంలోని అక్క ఇంటికి పంపించారని చెబుతున్నారు. ఈ విషయంపై తన భార్య సంధ్యను కలిసి మాట్లాడాలని సతీశ్‌ నిర్ణయించుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రూరల్‌ మండలం వెలివలలోని పినమామ ఇంటి వద్ద ఆమె ఉంటోందని తెలుసుకుని.. కేశవదాసుపాలెం నుంచి ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడికి వెళ్లాడు. అక్కడ రెండు రోజులు ఉన్నాడు. అనంతరం శుక్రవారం రాత్రి దంపతులిద్దరూ పిల్లలతో కలిసి చించినాడ వంతెన పైకి చేరుకున్నారు. అప్పటికే సిద్ధం చేసుకున్న సూసైడ్‌ నోట్‌ను, పిల్లల దుస్తులను, బైక్‌ను వంతెనపై వదిలేసి, గోదావరిలో దూకేశారని భావిస్తున్నారు. కుటుంబంలో వరుసగా జరిగిన పరిణామాలు అవమానకరంగా ఉండటం, సమాజంలో తలెత్తుకునే పరిస్థితి లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఎంతో సౌమ్యంగా ఉండే సతీశ్‌ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడడాన్ని ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. అతడి తండ్రి భగవాన్‌దాసు, తల్లి లక్ష్మి, బంధువులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.

మరిన్ని వార్తలు