Interesting Facts To Know About Tenali Jalebi Made With Jaggery - Sakshi
Sakshi News home page

తేనెలూరే తెనాలి జిలేబీ.. తింటే మైమరచిపోవాల్సిందే!

Published Mon, Aug 2 2021 8:26 AM

Here Is Full Details Of Tenali Jalebi Made With Jaggery - Sakshi

తెనాలి జిలేబీని నోట్లో వేసుకున్నామంటే తన్మయత్వంతో కళ్లు మూసుకుంటాం.. నోట్లో కరిగిపోతున్న ఆ జిలేబీ ముక్క మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ మైమరచిపోతాం. ఒక్కసారి రుచి చూశామా.. ఇక జిహ్వ చాపల్యం చెప్పనలవి కాదు. మళ్లీ మళ్లీ కావాలంటూ మారాం చేస్తుంది. ఆ అద్భుత రుచి కోసం అర్రులు చాస్తుంది. బంగారు వర్ణంతో ధగధగలాడినా.. నలుపు రంగుతో నిగనిగలాడినా.. తేనెలూరే ఆ తెనాలి జిలేబీ టేస్టే వేరు.. తిని తీరాల్సిందే! 

సాక్షి, తెనాలి: తెనాలిలో బోస్‌ రోడ్డు నుంచి వహాబ్‌చౌక్‌కు దారితీసే యాకూబ్‌హుస్సేన్‌ రోడ్డును ‘జిలేబీ కొట్ల బజారు’ అంటారు. అక్కడుండే జిలేబీ దుకాణాల వల్ల దానికి ఆ పేరు స్థిరపడింది. 1965 నుంచి ఇక్కడ జిలేబీ వ్యాపారం సాగుతోంది. చీమకుర్తి సుబ్బయ్య అనే వ్యక్తి అక్కడ జిలేబీ తయారీకి ఆద్యుడు. రంగువేయని బెల్లంతో జిలేబి తయారీని ఆరంభించాడు. నలుపు రంగుతో ఉండే ఈ జిలేబీ స్థానంలో రంగు వేసిన బెల్లంతో ఆకర్షణీయ జిలేబీని తెచ్చిన ఘనత మాత్రం బొట్లగుంట రామయ్యకు దక్కుతుంది. 1972లో వ్యాపారంలోకి వచ్చిన రామయ్య.. తెనాలి జిలేబీకి బ్రాండ్‌ ఇమేజ్‌ను తెచ్చి ‘జిలేబీ రామయ్య’ అయ్యారు. ఆంధ్రాపారిస్‌లో తయారైన జిలేబీ అంటే హాట్‌ కేక్‌లా అమ్ముడుపోతుంది. స్థానికుల దగ్గర్నుంచి, ప్రముఖుల వరకూ లొట్టలేసుకుంటూ తింటారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం తెనాలిలోని జిలేబీ బజారులో ఆరు దుకాణాలున్నాయి. పట్టణంలో వేర్వేరు చోట్ల మరో ఏడెనిమిదుంటాయి. 

చక్కెర స్వీట్లతో పోలిస్తే.. జిలేబీనే శ్రేష్టం
ఇతర స్వీట్లతో పోలిస్తే ధరలోనూ, నాణ్యతలోనూ జిలేబీనే శ్రేష్టం. పెరిగిన ధరల కారణంగా ప్రస్తుతం కిలో జిలేబీ రూ.140 పలుకుతున్నా, చక్కెర స్వీట్లతో చూస్తే దీని ధర తక్కువే. పైగా బెల్లంతో తయారీ అయినందున శరీరానికి ఐరన్‌ దొరుకుతుంది. రంగు వేయని బెల్లంతో చేసిన జిలేబీ మరింత సురక్షితం. వేడి వేడి జిలేబీ తింటే విరేచనాలు కట్టుకుంటాయని స్థానికులు చెబుతున్నారు. 


అమ్మకానికి సిద్ధంగా రంగు వేయని జిలేబీ 

తయారీ విధానం..
► చాయ మినప్పప్పు, బియ్యం పిండి, మైదా సమపాళ్లలో కలిపి 6–8 గంటలు నానబెడతారు.
►  కొద్దిగా గోరు వెచ్చని నీళ్లు కలిపి మెత్తటి ముద్దలా, చపాతీల పిండి కంటే జారుడుగా చేస్తారు. 
►  చిన్న రంధ్రం కలిగిన వస్త్రంలో మూటగా తీసుకుని, బాణలిలో మరిగిన నూనెలో చేతితో వలయాలుగా పిండుతారు. 
►  వేగిన తర్వాత వాటిని.. పక్కన వేరొక స్టవ్‌పై ఉండే బాణలిలో వేడిగా సిద్ధంగా ఉంచుకున్న బెల్లం పాకంలో వేసి..  బయటకు తీస్తారు.
► ఇక వేడి వేడి జిలేబీ రెడీ 

జిలేబీ తిన్నాకే.. 
చుట్టుపక్కల దాదాపు వంద గ్రామాలకు తెనాలి కూడలి అయినందున జిలేబీ వ్యాపారం విస్తరించింది. మరిన్ని దుకాణాలు వెలిశాయి. తెనాలి వచ్చిన గ్రామీణులు ముందుగా జిలేబీని తిన్నాకే ఇతర పనులు చూసుకుంటారు. అతిథులకు జిలేబీ ప్యాకెట్‌ బహుమతిగా ఇవ్వటం సంప్రదాయమైంది. ఈ ప్రాంతం నుంచి విదేశాల్లో స్థిరపడినవారు, బంధువులు వచ్చిపోయేటప్పుడు జిలేబీని తీసుకురమ్మని చెబుతుంటారు. చెన్నైలో తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంతకాలం సినీ ప్రముఖులకు తెనాలి జిలేబీ వెళ్లేదని వ్యాపారి సోమశేఖరరావు చెప్పారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ‘మెట్రో’లకే కాదు.. విదేశాల్లోని తెలుగువారికీ ఇక్కడ్నుంచి జిలేబీ పార్శిళ్లు వెళుతుంటాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో కొన్ని నెలలు మూతపడిన జిలేబీ దుకాణాలు, మళ్లీ ఆదరణ పొందుతున్నాయి. ప్రస్తుతం రోజుకు ఒక్కో దుకాణంలో సగటున 50 కిలోలపైనే అమ్ముడుపోతోంది. అన్ని దుకాణాల్లో కలిపి నెలకు సుమారు రూ.10.50 లక్షల వ్యాపారం జరుగుతోంది. 

అదే  మా జీవనాధారం..
మా తాత పేరు జిలేబీ రామయ్య. చిన్నప్పుడు ఆయన దుకాణంలోనే పనిచేశా. పెద్దయ్యాక వేరుగా వ్యాపారం చేస్తున్నా. జిలేబీ ప్రియుల సూచన మేరకు ఇప్పుడు నల్లబెల్లంతో తయారు చేస్తున్నాం. దేశవిదేశాలకూ సరఫరా చేస్తున్నాం.  
– కావూరి జనార్దనరావు, వ్యాపారి

తింటానికే వస్తుంటాను..
తెనాలి జిలేబీని ఒక్క సారి రుచి చూస్తే, మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. తరచూ జిలేబీ బజారుకు వస్తుంటాను. విరేచనాలు కట్టుకోవాలంటే వేడి వేడి జిలేబీ తింటే సరి. 
– భాస్కరుని లక్ష్మీనారాయణ, వినియోగదారుడు

Advertisement
Advertisement