ఏం కష్టం వచ్చిందో.. ముగ్గురు చిన్నారులు సహా కుటుంబం ఆత్మహత్య

28 Oct, 2023 19:31 IST|Sakshi

సూరత్‌: గుజరాత్‌లో విషాదం చోటుచేసుకుంది. ఏం కష్టమొచ్చిందో ఏమో ఓ కుటుంబమంతా ఆత్మహత్యకు పాల్పడింది. ముగ్గురు చిన్నారులతో సహా కుటుంబంలోని ఏడుగురు విగతజీవులుగా మారారు. తల్లిదండ్రులు, భార్య, పిల్లలకు విషమిచ్చిన ఓ వ్యాపారి ఉరేసుకొని తాను కూడా ప్రాణాలు వదిలాడు. కుటుంబం మొత్తం మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా అలజడి నెలకొంది. ఈ ఘోర ఘటన సూరత్‌లో శుక్రవారం అర్ధరాత్రి వెలుగుచూసింది.

వివరాలు..  సూరత్‌లోని పాలన్ పూర్‌లోని ఓ అపార్ట్ మెంట్‌లో ఫర్నీచర్ వ్యాపారి మనీష్ సోలంకి కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు నివసిస్తున్నారు. శుక్రవారం రాత్రి మనీష్‌ తన పిల్లలకు, తల్లిద్రండులకు, భార్యకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలతో సహా కుటుంబంలోని ఏడుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. శనివారం ఉదయం మనీష్‌ సహోద్యోగి కాల్‌ చేయగా లిఫ్ట్‌ చేయకపోవడంతో ఇంటికి చేరుకున్నాడు.

ఇంటి తలుపులు కూడా తీయకపోవడంతో అనుమానం వచ్చి వెనక డోర్‌ వద్దనున్న కిటీకిని ధ్వంసం చేసి ఇంట్లోగా వెళ్లగా ఈ దారుణం గురించి తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటన స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. మృతులను మనీష్ సోలంకి(35) అతని భార్య రీటా(32), ముగ్గురు పిల్లలు, మనీష్ తల్లిదండ్రులు కాంతిలాల్(65), శోభన(60) గా గుర్తించారు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.  ప్రాథమిక దర్యాప్తు ప్రకారం అప్పు తీసుకున్నవారు తిరిగి ఇవ్వకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువకావడంతో మనీష్ సోలంకి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 
చదవండి: పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం.. యువతి హత్య

మరిన్ని వార్తలు