స్కూల్‌ బస్‌ మిస్‌.. బైక్‌లో తీసుకెళ్తుండగా

16 Sep, 2022 14:37 IST|Sakshi
జయశ్రీ(ఫైల్‌), వర్షశ్రీ (ఫైల్‌)

వేలూరు(చెన్నై): స్కూల్‌ బస్సు వెళ్లిపోవడంతో కూతుళ్లను స్కూల్‌లో దింపడానికి వెళ్తున్న వారిని లారీ రూపంలో మృత్యువు వెంటాడింది. బైక్‌ మీద పిల్లలను వదలడానికి వెళ్తున్న ఓ తండ్రి గాయపడగా, ఇద్దరు కూతుళ్లు చనిపోయిన సంఘటన తిరుపత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. ఆంబూరు సమీపంలోని వీరాన్‌కుప్పం గ్రామానికి చెందిన దండపాణి, భార్య అనురాధ దంపతులకు జయశ్రీ(17), వర్షశ్రీ(12) ఇద్దరు కుమార్తెలు. వీరు ఆంబూరు సమీపంలోని పుదుగోవిందాపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు.

రోజూ పాఠశాలకు చెందిన బస్సులోనే స్కూల్‌కు వెళ్లొస్తారు. గురువారం ఉదయం ఇంటి వద్ద ఆలస్యం కావడంతో స్కూల్‌ బస్సు వెళ్లిపోయింది. దీంతో తండ్రి దండపాణి ఇద్దరు కుమార్తెలను బైకులో ఎక్కించుకుని స్కూల్‌ వద్ద దింపడానికి వెళ్తుండగా, ఆంబూరు సమీపంలోని ఓఆర్‌ఏ థియేటర్‌ వద్ద హోసూరు నుంచి చెన్నై వైపు వెళ్తున్న కంటైనర్‌ లారీ అతివేగంగా ఢీకొనడంతో బైకుపై ఉన్న జయశ్రీ, వర్షశ్రీ అక్కడిక్కడే మృతిచెందగా దండపాణికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న ఆంబూరు పోలీసులు దండపాణిని చికిత్స నిమిత్తం వేలూరులోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే స్థానికులు గమనించి లారీ డ్రైవర్‌పై దాడి చేయడంతో అతని పరిస్థితి విషమంగా మారింది. పోలీసులు లారీడ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆంబూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి, కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. స్కూల్‌కు వెళ్తున్న ఇద్దరు కుమార్తెలు మృతి చెందడంతో పాటు భర్తకు తీవ్ర గాయాలైన విషయం తెలిసి అనురాధ కన్నీరు మున్నీరైంది.

చదవండి: Dussehra Celebrations: దసరా ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు