లైంగిక దాడి కేసులో ఐదేళ్ల జైలు 

3 Feb, 2021 04:49 IST|Sakshi
షేక్‌ ఖాజాబాషా

కర్నూలు (లీగల్‌): చాక్లెట్‌ ఆశ చూపించి ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ మానవ మృగానికి కర్నూలు జిల్లా మొదటి అదనపు న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. కర్నూలులోని బండిమెట్టకు చెందిన ఆరేళ్ల బాలిక నగరపాలక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నది. అమ్మమ్మ  ఇంట్లో ఉంటూ  రోజూ పాఠశాలకు వెళ్లి వచ్చేది. గత ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లి తిరిగి పాఠశాలకు హాజరైంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పాఠశాల ముందు ఆడుకుంటుండగా నగరంలోని కల్లా వీధికి చెందిన గౌండా పనిచేసే షేక్‌ ఖాజాబాషా తన సైకిల్‌పై అక్కడికి వచ్చాడు. చాక్లెట్‌ ఇస్తానని నమ్మించి బాలికను సైకిల్‌పై తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ క్రమంలో బాలిక గట్టిగా కేకలు వేయడంతో చెంప దెబ్బలు కొట్టి రోడ్డుపై వదిలి వెళ్లిపోయాడు. బాలిక ఇంటికి రాకపోవడంతో అమ్మమ్మ పాఠశాల వద్దకు వెళ్లింది. అప్పటికే తాళం వేయడంతో ఆందోళన చెంది వెతుకుతుండగా బాలిక స్నేహితురాలు తారసపడింది. పుస్తకాల సంచి ఇచ్చి మధ్యాహ్నం నుంచి పాఠశాలకు రాలేదని చెప్పింది. కొద్దిసేపటి తర్వాత బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి అమ్మమ్మ, తాతకు విషయం చెప్పింది. దీంతో వారు కర్నూలు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ టి.నాగరాజు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అదేరోజు అరెస్ట్‌ చేశారు.  విచారణలో నేరం రుజువు కావడంతో  ఖాజాబాషాకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి బి.శ్యాంసుందర్‌ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున పీపీ హేజ్కెల్‌ వాదించారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు