పెళ్లైన రెండు నెలలకే భార్యను చంపిన భర్త

27 Jul, 2021 07:32 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న సీపీ కమలాసన్‌రెడ్డి

సాక్షి, కరీంనగర్‌: కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. భార్యపై అనుమానం పెంచుకొని కత్తి, గొడ్డలితో కిరాతకంగా చంపేశాడు. ఈ నెల 23న చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో నవవధువు హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం కమిషనరేట్‌ కేంద్రంలో వివరాలు వెల్లడించారు.. బొమ్మనపల్లికి చెందిన మ్యాదర అనిల్‌కు హుజురాబాద్‌కు చెందిన ప్రణాళికతో రెండునెలల కిత్రం వివాహమైంది. ప్రణాళిక బాసర ట్రిపుల్‌ ఐటీలో చదువుతుండేది.

అనిల్‌ హుస్నాబాద్‌లో బ్యాటరీ రిపేరింగ్‌ షాపు నిర్వహిస్తున్నాడు. పెళ్లయిన కొద్దిరోజుల నుంచే భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ప్రస్తుతం ఆషాఢమాసం కావడంతో ప్రణాళిక పుట్టింటికి వెళ్లింది. తన తల్లికి జ్వరం వచ్చిందని ఆమెను ఈ నెల 18న అనిల్‌ ఇంటికి తీసుకొచ్చాడు. ఈక్రమంలో 23న భార్యను హత్య చేయాలని పథకం వేసిన అనిల్‌ ఎవరికీ అనుమానం రాకుండా రోజులాగే హుస్నాబాద్‌లోని తన షాపునకు వెళ్లాడు. షాపు వద్ద అతడి స్నేహితుడొకరు బైక్‌ పెట్టి సాయంత్రం వచ్చి తీసుకుంటానని చెప్పి వెళ్లాడు.

ముందుగా కొనుగోలు చేసిన కత్తితో ఇంట్లో తన తల్లిదండ్రులు లేని సమయంలో అదే బైక్‌పై మధ్యాహ్నం ఇంటికెళ్లాడు. అప్పుడు సైతం ప్రణాళిక ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించడంతో అనుమానం మరింత పెరిగింది. ఆమె మంచం మీద పడుకుని ఫోన్‌ చూస్తుండగా పక్కనే ఉన్న అనిల్‌ చుట్టుపక్కలవారికి వినపడకుండా ఉండేందుకు టీవీ సౌండ్‌ పెద్దగా పెట్టాడు. ముందుగా కత్తితో మెడపై దాడి చేయగా ఆమె ప్రతిఘటించింది. అనంతరం గొడ్డలితో దాడి చేయగా అక్కడికక్కడే మృతిచెందింది.

దోపిడీ దొంగలు చేసినట్లు చిత్రీకరించి..
ఆయుధాలకు అంటిన రక్తం మరకలను కడగడంతో పాటు దోపిడీ దొంగలు హత్య చేసి బంగారు నగలు ఎత్తుకెళ్లినట్లు చిత్రీకరించాలని అనిల్‌ భావించాడు. ఆభరణాలతో తిరిగి హుస్నాబాద్‌ వెళ్లిపోయాడు. హత్యకు వాడిన బట్టలను కవర్‌లో పెట్టి చెరువుకట్ట వద్ద దాచిపెట్టాడు. అదే గ్రామానికి చెందిన స్నేహితుడు శ్రీకాంత్‌ వద్దకు వెళ్లి హుస్నాబాద్‌ శివారులో మద్యం సేవించాడు. సాయంత్రం పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తన తల్లి ప్రణాళిక చనిపోయి ఉందని ఫోన్‌ చేయగా వెంటనే అనిల్, శ్రీకాంత్‌ ఇద్దరు వెళ్లి డయల్‌ 100 ద్వారా పోలీసులకు సమాచారమందించారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిన ప్రదేశాన్ని సందర్శించిన సీపీ కమలాసన్‌రెడ్డి కేసు విచారణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. నిందితుడిని సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకొని అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా హత్య కేసును ఛేదించిన అధికారులు ఏఎస్పీ రితిరాజ్, కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ విజయసారథి, సీసీఎస్‌ ఏసీపీ శ్రీనివాస్, తిమ్మాపూర్‌ సీఐ శశిధర్‌రెడ్డి, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్లు మల్లయ్య, సృజన్‌రెడ్డి, సీసీఎస్‌ సీఐ రవి, చిగురుమామిడి ఎస్సై మధుకర్‌రెడ్డి, ఎల్‌ఎండీ ఎస్సై ప్రమోద్‌రెడ్డిలతో పాటు అన్ని స్థాయిల అధికారులను సీసీ అభినందించి రివార్డులు ప్రకటించారు.  

మరిన్ని వార్తలు