ఏడాదిన్నర క్రితం పెళ్లి, భార్యపై అనుమానం.. మూడు నిండు ప్రాణాలు బలి

8 Aug, 2022 08:26 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: అనుమానం పెనుభూతంగా మారింది. మూడు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. భార్యను, 5 నెలల పాపను గొంతు నులిమి చంపి, భర్త కూడా ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మండలం ఇస్కపల్లిపాళెంలో ఆదివారం జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు.. ఇస్కపల్లిపాళెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు ఆవుల మురళి (25)కి అదే గ్రామానికి చెందిన స్వాతి (22)తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. వారి సంసార జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో పాప పుట్టింటి. అప్పటి నుంచి ఆ బిడ్డ తనకు పుట్టినది కాదంటూ భార్య మీద భర్త అనుమానం పెంచుకున్నాడు.

దీనికి మురళీ తల్లిదండ్రులు, సోదరి ఆద్యం పోస్తూ వచ్చారు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తొలి కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన స్వాతి గురువారం అత్తారింటికి వచ్చింది. అయితే తాను అత్తింటికి వెళ్లనని భర్త, అత్త, మామ వేధిస్తున్నారని పదేపదే చెప్పినప్పటికి ఆడపడుచు తాను హామీగా ఉంటానని నమ్మించి అత్తారింటికి తీసుకొచ్చారు. ఈ ఆదివారం వేకువ జామున భార్య స్వాతి, పాపను గొంతు నులిమి హత్య చేసిన తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించాడు. దిక్కుతోచని స్థితిలో భర్త మురళి అదే గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో ఇస్కపల్లిపాళెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

మురళి కుటుంబ సభ్యులు స్టేషన్‌కు తరలింపు  
స్వాతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మురళి తల్లిదండ్రులు ఆవుల బంగారమ్మ, ఆవుల గోవిందయ్య, ఆడపడుచు వెంకటమ్మపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించినట్లు సీఐ ఖాజావలీ తెలిపారు. కావలి ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాసులు, అల్లూరు ఎస్సై శ్రీనివాసులు  విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు