పూటుగా మద్యం తాగి.. క్యాబ్‌ నడిపిస్తున్న యువతిపై..

27 Apr, 2021 10:52 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, బంజారాహిల్స్‌: షీక్యాబ్స్‌ నడిపిస్తున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. లంగర్‌హౌజ్‌లో నివాసం ఉంటున్న రియల్‌ ఎస్టేట్‌వ్యాపారి మోటా రమణ(55) ఆదివారం సాయంత్రం జీడిమెట్ల సమీపంలోని గాజులరామారంలో విందుకు హాజర­య్యాడు. అక్కడ పూటుగా మద్యం తాగిన రమణ ఇంటికి వెళ్లేందుకు ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌ క్యాబ్‌ను బుక్‌ చేసుకున్నాడు.

క్యాబ్‌ నడిపిస్తున్న యువతి (32)ని దారిపొడవునా అసభ్య పదజాలంతో మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. సరిగ్గా బంజారాహిల్స్‌ రోడ్‌ నెం–1 చేరుకోగానే ఆమె రమణ చేష్టలు భరించలేక రాత్రి 9.45 ప్రాంతంలో డయల్‌ 100కు ఫోన్‌ చేసింది. అప్రమత్తమైన బంజారాహిల్స్‌ పెట్రోలింగ్‌ పోలీసులు క్షణాల్లోనే బంజారాహిల్స్‌ రోడ్‌ నెం–12 చౌరస్తా సమీపానికి వచ్చి క్యాబ్‌ను ఆపడంతో పాటు ఆమెకు భద్రత కల్పించారు. నిందితుడు రమణను అరెస్టు చేసి బంజారాహిల్స్‌ పీఎస్‌కు తరలించారు. నిందితుడిపై ఐపీసీ 354, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు దర్యాప్తు అధికారి ఎస్‌ఐ కె.ఉదయ్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు