Drugs Case: ‘హెచ్‌ న్యూ’ అదుపులో లక్ష్మీపతి

6 Apr, 2022 07:32 IST|Sakshi

విశాఖ ఏజెన్సీలో పట్టుకున్న ప్రత్యేక బృందం 

ప్రేమ్‌ ఉపాధ్యాయకు హష్‌ ఆయిల్‌ సరఫరా చేసిన లక్ష్మీపతి 

నేడు అరెస్టు ప్రకటించే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నమోదైన తొలి డ్రగ్స్‌ మరణానికి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రేమ్‌ ఉపాధ్యాయకు హష్‌ ఆయిల్‌ సరఫరా చేసిన వీరవల్లి లక్ష్మీపతిని హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ) అధికారులు మంగళవారం పట్టుకున్నారు. గత వారం ప్రేమ్‌ ఉపాధ్యాయ అరెస్టుతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన లక్ష్మీపతి కోసం హెచ్‌–న్యూ ముమ్మరంగా గాలించింది.

మంగళవారం ఏపీలోని విశాఖ ఏజెన్సీలో అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకువస్తోంది. ఇతడికి ఈ ఆయిల్‌ సరఫరా చేస్తున్న అరకు మండలం లోగిలి ప్రాంతానికి చెందిన నగేష్‌ కోసం గాలిస్తున్నారు. లక్ష్మీపతి అరెస్టును బుధవారం ప్రకటించే అవకాశం ఉంది. ఓ కేసులో 2020 నవంబర్‌ 27న మల్కాజ్‌గిరి స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్వోటీ) పోలీసులు అరెస్టు చేసిన తర్వాత లక్ష్మీపతి ఇప్పుడు మళ్లీ చిక్కాడు.

చదవండి: ఇంటర్‌నెట్‌లో అండర్‌ వరల్డ్‌గా డార్క్‌ వెబ్‌!

సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని తులసి వనం కాలనీకి చెందిన లక్ష్మీపతి తండ్రి ప్రస్తుతం నల్లగొండ పోలీసు విభాగంలో ఆర్‌ఎస్సైగా పని చేస్తున్నారు. ఏడేళ్ల క్రితం బీటెక్‌ చదువుతున్న రోజుల్లోనే గంజాయికి బానిసగా మారిన లక్ష్మీపతిపై ఒకటిరెండు కేసులు నమోదు కావడంతో ఆయన కొడుకును పూర్తిగా దూరం పెట్టారు.

నగేష్‌ నుంచి తొలినాళ్లల్లో గంజాయి ఖరీదు చేస్తూ వచ్చిన లక్ష్మీపతి ఆ తర్వాత హష్‌ ఆయిల్‌ దందా మొదలెట్టాడు. జూబ్లీహిల్స్, మియాపూర్, మాదాపూర్, భువనగిరి, విశాఖపట్నాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని తన దందా కొనసాగించాడు. హష్‌ ఆయిల్‌ను ఇసోప్రోపిక్‌ ఆల్కహాల్‌తో కల్తీ చేసిన చరిత్ర లక్ష్మీపతికి ఉంది.  
 

>
మరిన్ని వార్తలు