కూకట్‌పల్లి ఏటీఎం: కాల్పులకు తెగబడ్డది ఆ ముఠానే!

1 May, 2021 11:27 IST|Sakshi
1) గతంలో జీడిమెట్లలోని లక్ష్మీ మనీ ట్రాన్స్‌ఫర్‌ సంస్థలో చోరీ సందర్భంగా సీసీ కెమెరాలో రికార్డయిన నిందితుల చిత్రం. 2) గురువారం కూకట్‌పల్లిలో ఏటీఎం దోపిడీకి వస్తున్న నిందితులు. రెండు ఘటనల్లోనూ బండి నడుపుతున్న నిందితుడు ఒకేరకమైన ప్యాంట్, హెల్మెట్‌ ధరించి కనిపించాడు- దోపిడీ అనంతరం పారిపోతున్న సమయంలో హెల్మెట్‌ లేకపోవడంతో సీసీ కెమెరాల్లో నిందితులు ఇలా చిక్కారు.

నగరానికి దినసరి కూలీలుగా వచ్చిన ఇద్దరు నిందితులు

తేలిగ్గా డబ్బు సంపాదించాలనే వరుస నేరాలు

గత నెల 16న జీడిమెట్లలోని ఓ సంస్థలోనూ దోపిడీ

తుపాకీ, డబ్బుతో రైలులో పారిపోయిన దుండగుడు

మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఎస్‌వోటీ 

సాక్షి, హైదరాబాద్‌: బిహార్‌ నుంచి వలస కూలీలుగా వచ్చారు.. ఇక్కడ దోపిడీ దొంగల అవతారం ఎత్తారు. తేలిగ్గా డబ్బు సంపాదించాలని నేరబాట పట్టారు. ఏటీఎం వద్ద కాల్పులకు తెగబడి దోపిడీకి పాల్పడింది బిహార్‌ ముఠానేనని పోలీసులు గుర్తించారు. కూకట్‌పల్లి విజయ్‌నగర్‌ కాలనీలోని ఏటీ ఎం కేంద్రం వద్ద దుండగులు గురువారం ఓ సెక్యూరిటీ గార్డ్‌ను చంపి రూ.5 లక్షలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే.

ఇద్దరు నిందితుల్లో ఒకరిని సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు గురువారం అర్ధరాత్రి పట్టుకున్నారు. మరో నిందితుడు ఆయుధం, డబ్బు తో రైలులో పారిపోయినట్లు గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. బిహార్‌కు చెందిన ఇద్దరు యువకులు జీడిమెట్ల–చందానగర్‌ మధ్య ప్రాంతంలో నివసిస్తూ కొద్దిరోజులు దినసరి కూలీలుగా పనిచేశారు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పూనుకున్నారు.

గతంలోనూ నాటు తుపాకీతో బెదిరించి.. 
నిందితులు కొన్నాళ్ల క్రితం తమ స్వస్థలంలో ఓ నాటు పిస్టల్‌ ఖరీదు చేసుకుని వచ్చారు. జీడిమెట్ల అయోధ్యనగర్‌ చౌరస్తాలో ఉన్న లక్ష్మీ మనీ ట్రాన్స్‌ఫర్‌ సంస్థను టార్గెట్‌ చేశారు. గత నెల 16న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తన దుకాణం మూసేందుకు సిద్ధమైన యజమాని రవికుమార్‌ రూ.1.95 లక్షలను తన బ్యాగ్‌లో పెట్టుకున్నారు. అదే సమయంలో హెల్మెట్, మాస్క్‌ ధరించిన ఇద్దరు దుండ గులు ఆ దుకాణంలోకి ప్రవేశించి రవికుమార్‌కు తుపాకీ గురిపెట్టి, అరిస్తే చంపేస్తామంటూ బెదిరించారు. ఆయన వద్ద నగదు ఉన్న బ్యాగ్‌తోపాటు సెల్‌ఫోన్‌ తీసుకుని ఉడాయించారు. ఈ నేరం చేసిన తర్వాత నిందితులు కొన్ని రోజులు మిన్నకుండిపోయారు.

ఏటీఎం కేంద్రాలు ధ్వంసం చేయలేమనే..
ఆపై కూకట్‌పల్లి ప్రాంతంలోని ఏటీఎం కేంద్రాలపై గురిపెట్టారు. వాటిని ధ్వంసం చేసి డబ్బు దోచుకోవడం సాధ్యం కాదని భావించి, డబ్బు నింపడానికి వచ్చే వాహనాన్ని టార్గెట్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ వాహనాలు వచ్చే సమయాలు, రూట్లతోపాటు నేరం చేసిన తర్వాత పారిపోయేందుకు వీలున్న ప్రాంతాలను రెక్కీ ద్వారా విజయ్‌నగర్‌ కాలనీ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. జీడిమెట్లలో నేరం చేయడానికి తమకు పరిచయస్తుడైన వ్యక్తి నుంచి యాక్టివా వాహనం తీసుకున్నారు. కానీ, విజయ్‌నగర్‌కాలనీలో నేరం కోసం మాత్రం బైక్‌ ఉండాలని భావించారు. బాలానగర్‌ జోన్‌ పరిధి నుంచి ఓ పల్సర్‌ వాహనాన్ని చోరీ చేసి దాని నంబర్‌ ప్లేట్‌ తీసేసి వినియోగించారు. విజయ్‌నగర్‌ కాలనీలో చోరీ చేసి కేపీహెచ్‌బీ వైపు పారిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. 

గ్లాస్‌డోర్‌పై వేలిముద్రల సహాయంతో...
ఇద్దరిలో ఓ నిందితుడు వాహనాన్ని తీసుకుని లిం గంపల్లి వరకు వెళ్లాడు. అక్కడే ద్విచక్ర వాహనాన్ని వదిలేసి డబ్బు, తుపాకీతో రైలులో మహారాష్ట్రకు పారిపోయాడు. ఏటీఎం కేంద్రంలోని గ్లాస్‌ డోర్‌పై నిందితుల వేలిముద్రలు దొరికాయి. ఇవి దుండిగల్‌లో సేకరించిన వేలిముద్రలతో సరిపోలాయి. అలా అనుమానితులను గుర్తించి సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్లిన పోలీసులు బాలానగర్‌లోని ఒక నిందితుడిని గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు.

ఇతడిని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ముఠాలో మరికొందరు ఉండి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో దుండిగల్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన నేరంలో వీరి పాత్రపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు పాల్గొన్నారని, ముఠాలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన కస్టోడియన్‌ శ్రీనివాస్‌ను చికిత్స అనంతరం వైద్యులు శుక్రవారం డిశ్చార్జ్‌ చేశారు. ఈ కేసు దర్యాప్తును నేరుగా కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ పర్యవేక్షిస్తున్నారు.

చదవండి: ఈటల కథ క్లైమాక్స్‌కు.. ఏం జరగబోతోంది..?
హైదరాబాద్‌: ఆడపిల్ల పుట్టిందని ఆటోలో వదిలేశారా?

మరిన్ని వార్తలు