ప్రేమజంట ఆత్మహత్య 

1 Jan, 2021 10:11 IST|Sakshi

మల్కన్‌గిరి : పెద్దలు పెళ్లికి నిరాకరించారన్న నెపంతో స్థానిక మల్కన్‌గిరి సమీపంలోని ఎంవీ–42 గ్రామంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. గ్రామ స్తుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాలను పోలీసులు తరలించారు. వివరాలిలా ఉన్నాయి..ఎంవీ–42 గ్రామానికి చెందిన బిక్కి సుఖ్‌ధర్, సోరిత ఇద్దరూ గత కాలంగా ప్రేమించుకుంటున్నారు.

ఈ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాలు వీరి ప్రేమను ఒప్పుకోలేదు. దీంతో ఈ జన్మలో తమ పెళ్లి కాదని భావించిన వీరు.. బుధవారం రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఇంటి నుంచి బయటకు పారిపోయి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. జంటగా ఇంటికి వెళ్తే ఇంట్లో వారు ఏమైనా అంటారేమోనన్న భయంతో గ్రామ శివారులోని ఓ మర్రిచెట్టుకి వీరిద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం అటువైపుగా వెళ్తున్న కొంతమంది గ్రామస్తులు చెట్టుకు వేలాడుతున్న వీరి మృతదేహాలు చూసి బాధిత కుటుంబాలు, పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ క్రమంలో సంఘటన స్థలానికి చేరుకున్న ఇరు కుటుంబాల సభ్యులు తమ బిడ్డల మృతదేహాలు చూసి, కన్నీరుమున్నీరయ్యారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. 
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు