తోరణాల తడి ఆరనేలేదు..పెళ్లి ముచ్చట్లు తీరనే లేదు.. అంతలోనే..

12 Sep, 2021 13:09 IST|Sakshi
ఆస్పత్రి వద్ద రోదిస్తున్న తిరుపతిరావు తల్లి తవుడమ్మ, కుటుంబ సభ్యులు

జన్నివలసలో గణేష్‌ నిమజ్జనంలో అపశ్రుతి 

చెరువులో మునిగి యువకుడి మృతి 

రామభద్రపురం(విజయనగరం): ఆ ఇంటి ముంగిట కట్టిన పచ్చని కొమ్మలు వాడనే లేదు.. పెళ్లి ముచ్చట్లు తీర లేదు.. గణపతి ఉత్సవాలను వేడుకగా నిర్వహించి.. సంతోషంగా సాగిపోతున్న నూతన జంటపై విధి కన్నెర్ర చేసింది. చెరువు రూపంలో భర్తను కాటేసింది. పెళ్లయిన రెండు నెలలకే ఆ ఇంట విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాలూరు పట్టణంలోని దుర్గాన వీధికి చెందిన రాంబార్కి తిరుపతిరావు(29) విశాఖపట్టణంలోని పెప్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

రామభద్రపురం మండలంలోని జన్నివలస గ్రామానికి చెందిన పత్తిగుళ్ల కుమారిని ఈ ఏడాది జూన్‌ 24న వివాహం చేసుకున్నాడు. వినాయక చవితిని అత్తవారింట్లో సరదాగా జరుపుకుందామన్న ఉద్దేశంతో భార్యా భర్తలిద్దరూ సాలూరులో గురువారం సాయంత్రం బాలగణపతి విగ్రం కొనుగోలు చేసి జన్నివల స వచ్చారు. వినాయక పూజను శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరిపారు. అదేరోజు సాయంత్రం గ్రామం పొలిమేరల్లో ఉన్న పత్తిగుళ్లవాని చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్లారు.

ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు పూర్తిస్థాయిలో నిండడం, చెరువు లోతును గుర్తించని తిరుపతిరావు కాస్త ముందుకు వెళ్లాడు. అంతే.. ఈత రాకపోవడంతో కుటుంబ సభ్యుల కళ్లముందే మునిగిపోయాడు. భార్య కుమారి కేకలు వే యడంతో పలువురు చేరుకుని మునిగిపోతు న్న తిరుపతిరావును ఒడ్డుకు చేర్చారు. అప్పటికే నీరు ఎక్కువగా తాగడంతో హుటాహుటిన సాలూరు సీహెచ్‌సీకి తరలించినా ఫలితం లేకపోయింది.

భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడంతో పాటు మృతదేహానికి సాలూరు సీహెచ్‌సీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు. వివాహమైన రెండు నెలలకే తిరుపతిరావు మృతితో అటు కన్నవారు, ఇటు అత్తవారింటిలో విషాదచాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు తవుడమ్మ, తవుడు, అత్త బుచ్చమ్మ, భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.   

చదవండి: ఏడాదిన్నర పాప.. ఆడుకుంటూ.. మృత్యు ఒడిలోకి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు