ఎన్నారైనంటూ ప్రేమ, సహజీవనం.. ఆపై బ్లాక్‌మెయిలింగ్‌

11 Nov, 2021 06:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: తూర్పు గోదావరి జిల్లా నుంచి వలసవచ్చి గచ్చిబౌలిలో స్థిరపడిన షేక్‌ మహ్మద్‌ రఫీ సోషల్‌మీడియాలో కార్తీక్‌ వర్మగా మారిపోయాడు. ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌ ద్వారా అనేక మంది యువతులకు ఎర వేశాడు. ప్రేమ, సహజీవనం, పెళ్లి పేరుతో వారిని నమ్మించాడు. ఆపై బ్లాక్‌మెయిలింగ్‌కు దిగి అందినకాడికి దండుకుని నిండా ముంచాడు. ఈ ఘరానా మోసగాడిని ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు బుధవారం 
వెల్లడించారు.  
తూర్పు గోదావరి జిల్లా తుని మండలం హంసవరానికి చెందిన రఫీ పాలిటెక్నిక్‌ విద్య మధ్యలో మానేశాడు. బతుకు తెరువు కోసం 2010లో నగరానికి వచ్చి గచ్చిబౌలిలో స్థిరపడ్డాడు. తొలినాళ్లల్లో అక్కడక్కడా పని చేసినా ఆపై మానేశాడు. 
2017లో ఓ యువతిని వివాహం చేసుకోవడంతో పాటు కుమార్తెకు తండ్రి అయ్యాడు. ఇతగాడి వరకట్న వేధింపులు తట్టుకోలేక వేరుపడిన భార్య నెల్లూరు జిల్లాలోని గూడూరు టౌన్‌ పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టింది. 
విలాసవంతంగా బతకడానికి అలవాటుపడిన రఫీ అందుకు అవసరమైన డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడు. కార్తీక్‌ వర్మ పేరుతో ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేశాడు. వీటి ఆధారంగా యువతులు, మహిళలకు రిక్వెస్ట్‌ పంపాడు. 
ఇలా తనకు ఫ్రెండ్స్‌గా మారిన వారితో తాను భారత సంతతికి చెందిన వాడినైనా అమెరికాలో పుట్టానని, తల్లిదండ్రులు చిన్నతనంలోనే వేరయ్యారని చెప్పేవాడు. తల్లి ప్రస్తుతం సింగపూర్‌లో డాక్టర్‌గా పని చేస్తోందంటూ నమ్మించేవాడు. 
తాను తాత్కాలిక ప్రాతిపదికనే ఇండియాకు వచ్చానని చెప్పి ప్రేమ, పెళ్లి, సహజీవనం అంటూ వారికి సన్నిహితంగా మారేవాడు. కొన్నాళ్లు ప్రేమగా వ్యవహరించే రఫీ ఆపై బ్లాక్‌మెయిలింగ్‌కు దిగడం మొదలెట్టాడు. 
కొందరికి బెదిరించి, మరికొందరితో అత్యవసరం... తిరిగి ఇస్తానంటూ చెప్పి డబ్బు, నగలు తీసుకునే వాడు. ఎవరైనా తమ డబ్బు, నగలు తిరిగి ఇవ్వమంటే వారి నెంబర్లు బ్లాక్‌ చేయడం, తన నివాసం మార్చేసి తప్పుకోవడం చేశాడు. 
 ఇలా నగరంలోనే దాదాపు ఐదుగురిని మోసం చేశాడు. ఇతడి బారినపడిన ఓ యువతి ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. రంగంలోకి దిగిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలోని బృందం రఫీని పట్టుకుంది. 
ఇతడి నుంచి రూ.9 లక్షల విలువైన 18 తులాల బంగారు ఆభరణాలు, నకిలీ గుర్తింపుకార్డులు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని ఎస్సార్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు