మానసిక వికలాంగురాలిపై లైంగికదాడి

22 Apr, 2022 05:24 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఘటన

వెంటనే స్పందించిన పోలీసులు.. ముగ్గురి అరెస్ట్‌

పాయకాపురం (విజయవాడ రూరల్‌)/లబ్బీపేట (విజయవాడ తూర్పు)/సాక్షి, అమరావతి: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై ముగ్గురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు.. నిందితులు ముగ్గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఘటన వివరాలు.. విజయవాడ వాంబే కాలనీకి చెందిన ఒక మహిళ.. మానసిక వికలాంగురాలు (23) అయిన తన కూతురు కనిపించడం లేదంటూ ఈ నెల 19న నున్న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు చిన్న క్లూ ఆధారంగా ప్రభుత్వాస్పత్రిలో చెదల నివారణ కాంట్రాక్టర్‌ వద్ద పనిచేసే దారా శ్రీకాంత్‌ శేఖర్‌ను ఫోన్‌లో విచారించారు.

యువతి తన వద్దకు వచ్చిందని.. అయితే ఈ సమయంలో ఎందుకు వచ్చావంటూ ఆటో ఎక్కించి పంపించేశానని శ్రీకాంత్‌ తొలుత చెప్పాడు. తదుపరి విచారణలో బాధిత యువతి ఆస్పత్రి ఎ–బ్లాక్‌ రెండో అంతస్తులో చెదల నివారణ సామగ్రి ఉంచే గదిలో ఉన్నట్లు తెలుసుకుని పోలీసులు అక్కడకు వెళ్లారు. ప్రభుత్వాస్పత్రిలో తనకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి శ్రీకాంత్‌ లైంగికదాడి చేశాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. మరుసటి రోజు అదే గదిలో శ్రీకాంత్‌ వదిలివెళ్లిపోగా మరో వర్కర్‌ బాబూరావు, అతడి స్నేహితుడు పవన్‌ కళ్యాణ్‌ తనపై లైంగికదాడికి పాల్పడ్డారని బోరుమంది. దీంతో పోలీసులు యువతి మిస్సింగ్‌ కేసును రేప్‌ కేసుగా మార్చి వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి పంపారు.

తర్వాత దిశ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాల ద్వారా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, లైంగిక దాడికి పాల్పడ్డ ఇద్దరు కార్మికులను తొలగించడంతోపాటు ఘటన జరిగిన ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.సౌభాగ్యలక్ష్మి కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కాంట్రాక్టును కూడా రద్దు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. స్టాఫ్‌ నర్సుతోపాటు నైట్‌ డ్యూటీ హెడ్‌ నర్సుకు మెమోలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు