విషాదం: పుట్టిన కొన్ని గంటలకే శిశువు.. ఆ వెంటనే తల్లి.. 

16 Mar, 2022 11:02 IST|Sakshi
ఆందోళన చేస్తున్న మృతురాలి బంధువులు

 ప్రైవేటు నర్సింగ్‌హోమ్‌లో తల్లీబిడ్డ మృతి

పుట్టిన కొన్ని గంటలకే శిశువు.. ఆ వెంటనే తల్లి.. 

వైద్యురాలి నిర్లక్ష్యంతోనే మృతి చెందారని బంధువుల ఆందోళన

సాక్షి. ఆదిలాబాద్‌: శుభవార్త కోసం వేచిచూస్తున్న ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది.. మొదటి కాన్పు కావడంతో పుట్టింటి, నెట్టింటివారు గర్భి ణిని ప్రసవం కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. మధ్యాహ్న మగ శిశువుకు జన్మనివ్వడంతో అందరూ ఆనందంలో మునిగిపోయారు. అయితే వారి సంతోషం ఎక్కువసేపు నిలువలేదు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో శిశువు మృతిచెందగా, సాయంత్రం 5 గంటలకు బాలింత తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది.

ఆదిలాబాద్‌ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన సయ్యద్‌ అక్బర్‌అలీ, షాకెర సుల్తానాకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇటీవల షాకెరా సుల్తానా గర్భం దాల్చింది. మంగళవారం ఉదయం 8 గంటలకు పురిటినొప్పులు రావడంతో కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని శారద నర్సింగ్‌ హోమ్‌కు తరలించారు. ఆస్పత్రి సిబ్బంది ఉదయం 11.30 గంటలకు ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లారు. 2.30 గంటల ప్రాంతంలో మగ బిడ్డకు జన్మనిచ్చిందని వైద్యులు  తెలిపారు. అయితే శిశువు శ్వాస సరిగా తీసుకోవడంలేదని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు.

ఆ తర్వాత కొద్దిసేపటికే శిశువు మరణించడంతో కుటుంబీకులు అంత్యక్రియలు జరిపారు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో బాలింత కూడా మృతిచెందిందని వైద్యురాలు చైతన్య స్రవంతి కుటుంబ సభ్యులకు తెలిపారు. మొదట బాలింత పరిస్థితి ఏ విధంగా ఉందని అడగగా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము హైదరాబాద్‌ తీసుకెళ్తామని చెప్పినా ఇక్కడే వైద్యం అందిస్తామని వైద్యురాలు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 
చదవండి: తెలంగాణ: ఒక్కరోజే ఆరుగురి మృతి.. దాంతో ఆటలోద్దు!

డాక్టర్‌ నిర్లక్ష్యంతోనే..
వైద్యురాలి నిర్లక్ష్యంతో తల్లీబిడ్డ మృతిచెందారని బంధువులు, కుటుంబీకులు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. భారీ సంఖ్యలో జనాలు చేరుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆస్పత్రిలోనికి చొరబడి ఫర్నిచర్‌ ధ్వంసం చేసేందుకు యత్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యురాలిపై కేసు నమోదు చేసి ఆస్పత్రిని సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదిలాబాద్‌ డీఎస్పీ వెంకటేశ్వర్‌రావ్, వన్‌టౌన్‌ సీఐ, ఎస్సైలు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. అయినా ఆందోళన కొనసాగించారు.

ఆస్పత్రిలో ఉన్న ఆందోళనకారులను పోలీసులు బయటకు తీసుకురావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే ఓ వైద్యుడు సాధారణ కాన్పు జరిగిందని, బీపీ ఎక్కువై ఫిట్స్‌ రావడంతో బాలింత మృతిచెందిందని తెలిపారు. ఈ విషయమై వైద్యులను ‘సాక్షి’ సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు. 

మరిన్ని వార్తలు