అన్నను కొట్టిచంపిన సోదరులు

7 Jul, 2021 21:13 IST|Sakshi
రాజేష్‌(ఫైల్‌)

సాక్షి, దుగ్గొండి(వరంగల్‌): వారంతా ఒకే తల్లీబిడ్డలు. కలిసి పెరిగి పెద్దవారయ్యారు. ఇన్ని రోజులు అన్యోన్యంగానే ఉన్నారు. కానీ ఆస్తి వారి మధ్య చిచ్చు పెట్టింది. ఆస్తి పంపకం విషయంలో గొడవపడి కుటుంబ సభ్యులు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇదే క్రమంలో సోదరులు, సోదరి, తల్లిచేతిలో పెద్ద కుమారుడు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన దుగ్గొండి మండలం బంధంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన మక్కాజి ప్రమీలకు ముగ్గురు కుమారులు రాజేష్‌ (32) ప్రవీణ్, నాగరాజు, కూతురు సరిత ఉన్నారు.

రాజేష్‌ గత కొంత కాలంగా హన్మకొండలో కారు క్యాబ్‌ సర్వీస్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గత రెండు రోజుల క్రితం భార్య శైలజ, రెండేళ్ల కుమారుడితో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. ఇంటి ఆస్తి విషయంలో రాజేష్‌తో తమ్ముళ్లు ప్రవీణ్, నాగరాజు, సోదరి సరిత, తల్లి ప్రమీల గొడవ పడ్డారు. వీరంతా బండరాయితో మూకుమ్మడిగా రాజేష్‌పై దాడి చేయడంతో ఇంట్లోనే కుప్పకూలాడు. కొన ఊపిరితో రాజేష్‌ను ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని నర్సంపేట ఏసీపీ ఫణీందర్, సీఐ సతీష్‌బాబు, ఇన్‌చార్జి ఎస్సై వెంకటేశ్వర్లు పరిశీలించారు. మృతుడి భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు