కొడుకు కళ్లెదుటే దారుణం.. అంతా క్షణంలో జరిగిపోయింది

21 May, 2022 10:19 IST|Sakshi

సాక్షి, టెక్కలి(శ్రీకాకుళం): కొడుకు కళ్లెదుటే తల్లి దుర్మరణ చెందింది. ఈ విషాద ఘటన స్థానిక మెళియాపుట్టి రోడ్డు జంక్షన్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద శుక్రవారం జరిగింది. సిఫ్ట్‌ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో వెనుక కూర్చున్న మహిళా ఉద్యోగి తీవ్రంగా గాయపడి చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. టెక్కలి అయ్యప్పనగర్‌లో నివాసముంటూ దాసరి వరలక్ష్మి (39) వంశధార కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.

శుక్రవారం మధ్యాహ్నం ఇంజినీరింగ్‌ చదువుతున్న కుమారుడు ఢిల్లేశ్వరసాయితో కలిసి సొంత గ్రామం గూడెంలో జరుగుతున్న ఓ కార్యం సందర్భంగా భోజనం కోసం ద్విచక్ర వాహనంపై మెళియాపుట్టి రోడ్డు వద్దగల ఫ్లైవర్‌ బ్రిడ్జి దిగువ నుంచి వెళ్తున్నారు. ఇదే సమయంలో టెక్కలి మండలం అయోధ్యపురం గ్రామానికి చెందిన బి.హరి తన కారులో శ్రీకాకుళం నుంచి టెక్కలికి వచ్చేందుకు మెళియాపుట్టి రోడ్డు జంక్షన్‌ అప్రోచ్‌ రోడ్డు దిగుతున్న క్రమంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో బైక్‌ వెనుక కూర్చున్న వరలక్ష్మి తలకు తీవ్రగాయాలు కాగా.. ఢిల్లేశ్వరసాయికి స్వల్ప గాయాలయ్యాయి.

ఇరువురిని అదే కారులో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు చేసి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న గూడేం గ్రామ ప్రజలు ఆస్పత్రికి చేరుకుని రోదించారు. టెక్కలి సీఐ వెంకట గణేష్‌ ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించారు. కారుని, దాన్ని నడుపుతున్న హరిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ఎన్‌.కామేశ్వరరావు తెలిపారు. కాగా మృతురాలు వరలక్ష్మి భర్త ధనంజయరావు కూడా పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈమెకు ఇద్దరు పిల్లలు కాగా..కుమార్తెకు ఇటీవలే వివాహం చేసినట్టు స్థానికులు తెలిపారు.

చదవండి: బెజవాడలో ఫేమస్‌.. రామకృష్ణ బుల్లెట్‌ గ్యారేజ్‌  

మరిన్ని వార్తలు