Nalgonda: పట్టపగలే దారుణం.. మధ్యవయస్కురాలిపై హత్యాచారం

23 Sep, 2021 08:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పెద్ద వయసు మహిళపై దారుణానికి పాల్పడ్డ యువకులు 

అత్యాచారం చేసి, తలను గోడకు బాది హత్య.. 

ఆపై బంగారు నగలు అపహరణ 

నిందితులను చితకబాది పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు  

నల్లగొండ జిల్లా ముషంపల్లిలో పట్టపగలే ఘటన

నల్లగొండ క్రైం: వ్యసనాలకు బానిసైన ఇద్దరు యువకులు.. ఓ పెద్ద వయసు మహిళపై పట్టపగలే అత్యాచారానికి పాల్పడ్డారు.. ఆమెపై ఉన్న బంగారాన్ని లాక్కుని, చివరికి హత్య చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రానికి దగ్గరిలో ఉన్న మూషంపల్లి గ్రామంలో బుధవారం ఉదయం 11 గంటలకు ఈ దారుణం జరిగింది. ఇంత దుర్మార్గానికి పాల్పడిన ఇద్దరూ 34 ఏళ్లలోపు వారే.. బాధిత మహిళ ఇంటికి సమీపంలో ఉండేవారే కావడం గమనార్హం. నిందితులను అదే గ్రామానికి చెందిన బక్కతొట్ల లింగయ్యయాదవ్, ఏర్పుజర్ల కుమ్మరి పుల్లయ్యగా గుర్తించారు. 

గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూషంపల్లికి చెందిన గుడిపాటి ధనలక్ష్మి (54), ఆమె భర్త తమ ఇంటికి కొద్దిదూరంలో ఓ కిరాణా షాపు నడిపిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ధనలక్ష్మి తమ ఇంటి నుంచి కిరాణాషాపు వద్దకు బయలుదేరింది. అప్పుడే ఒక్కసారిగా వర్షం మొదలైంది. ధనలక్ష్మి హడావుడిగా వెళ్తుండగా.. దారిమధ్యలో ఉన్న లింగయ్య యాదవ్‌ ఇంటివద్ద అతనితోపాటు ఏర్పుజర్ల పుల్లయ్య ఆమెను ఆపారు. ఇద్దరూ కలిసి బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లారు. ఆమెపై సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఒంటిపై ఉన్న నగలు లాక్కున్నారు. పెనుగులాటలో ఒక బంగారు గొలుసు ఆమె చేతిలోనే ఉండిపోయింది. 
(చదవండి: బాలికల పాలిట రాక్షసుడు: ఐదుగురిని చెరబట్టి 50 వీడియోలు తీసి)

ఈ క్రమంలోనే ఇద్దరూ ఆమె తలను నేలకు, గోడకేసి కొట్టడంతో చనిపోయింది. దీంతో అప్రమత్తమైన లింగయ్య, పుల్లయ్య ఇద్దరూ కలిసి ధనలక్ష్మి మృతదేహాన్ని ఇంటి వరండాలో ఉన్న రేకుల షెడ్‌ కిందికి తీసుకెళ్లి పెట్టారు. ఇంట్లో రక్తపు మరకలను కడిగేశారు. తర్వాత ఇద్దరూ ఏమీ తెలియనట్టు ప్రవర్తించారు. లింగయ్య ఇంట్లోనే ఉండగా.. పుల్లయ్య బయటికి వెళ్లిపోయాడు. అయితే ఊర్లో పాఠశాల వద్ద ధనలక్ష్మి మరిది గుడిపాటి వెంకన్న కనిపించడంతో.. ‘మీ వదిన రోడ్డుపై పడి ఉంది’అని పుల్లయ్య అన్నాడు. 

వెంకన్న పరుగున వచ్చి చూసేసరికి.. వరండాలో రక్తపు మడుగులో ఉన్న ధనలక్ష్మి కనిపించింది. ఇది తెలిసిన గ్రామస్తులు.. లింగయ్య, పుల్లయ్యలను పట్టుకుని చితకబాది, పోలీసులకు అప్పగించారు. ఘటనపై నల్లగొండ రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ధనలక్ష్మికి భర్త భిక్షమయ్య, ఇద్దరు కుమార్తెలు ఉండగా.. ఇప్పటికే కుమార్తెల వివాహాలు జరిగాయి. 
(చదవండి: రాజు... నేరచరితుడే! )

నిందితులిద్దరిదీ నేర చరిత్రే.. 
బక్కతొట్ల లింగయ్య, పుల్లయ్య ఇద్దరూ వ్యవసాయ పనులు చేసి జీవిస్తుంటారు. కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యారు. కొన్నేళ్ల కింద పుల్లయ్య భార్య విడాకులు తీసుకొని వెళ్లిపోగా రెండో వివాహం చేసుకున్నాడు. తర్వాత కూడా నిత్యం గొడవలు పెట్టుకుని.. రెండో భార్యను, ఏడాదిలోపు కుమార్తెను చంపేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక బక్కతొట్ల లింగయ్య కూడా మహిళలతో తరచూ అసభ్యంగా ప్రవర్తించేవాడని గ్రామస్తులు చెప్తున్నారు. 

వారం రోజుల కింద కూడా గ్రామంలో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని.. అయితే లింగయ్య భార్య వచ్చి బతిమాలడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది. తర్వాత లింగయ్య భార్య పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని స్థానికులు చెప్తున్నారు. మద్యం మత్తులో లింగయ్య, పుల్లయ్య ఇద్దరూ ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటారని అంటున్నారు. 

చదవండి: యువతిపై క్యాబ్‌ డ్రైవర్‌ లైంగికదాడి!.. నిందితుని వాదన మరోలా

మరిన్ని వార్తలు