నంద్యాల: కుటుంబం ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌

7 Nov, 2020 11:21 IST|Sakshi
భార్య, పిల్లలతో షేక్‌ అబ్దుల్‌ సలామ్‌ (ఫైల్‌)

సాక్షి, కర్నూలు : నంద్యాలలో  షేక్‌ అబ్దుల్‌ సలామ్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు కారణం పోలీసులే అంటూ సెల్ఫీ వీడియో ఒకటి బయటకు వచ్చింది. తమ కుటుంబానికి సాయం చేసే వారు ఎవరూ లేరంటూ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సంబంధంలేని కేసులో పోలీసులు అన్యాయంగా ఇరికించారని కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు నాకు చోరీ కేసును అంటగట్టారని ఆవేదన చెందారు. కాగా ఈనెల 3న అబ్దుల్‌ సలాం కుటుంబం రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. (బిడ్డలతో కలిసి దంపతుల ఆత్మహత్య)

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల మూలసాగరం ప్రాంతానికి చెందిన అబ్దుల్‌సలామ్‌ (45) తన భార్య నూర్జహాన్‌ (38), కుమార్తె సల్మా (14), కుమారుడు దాదా ఖలంధర్‌ (10)తో కలిసి మంగళవారం గూడ్స్‌ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి రూ.70 వేలు పోగొట్టుకున్నాడు. ఆ కేసులో విచారణ నిమిత్తం పోలీసులు సోమవారం అబ్దుల్‌ సలామ్‌ను స్టేషన్‌కు పిలిచి విచారణ జరిపారు. ఈ పరిస్థితుల్లో తాను బతకడం అనవసరం అనుకున్నాడు. భార్య, ఇద్దరు బిడ్డల ప్రాణాలను సైతం తనతో తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అంతా కలసి రైలు పట్టాలను ఆశ్రయించారు. వారి మీదనుంచి గూడ్స్‌ రైలు దూసుకుపోయింది. నలుగురి ప్రాణాలూ గాలిలో కలిసిపోయాయి. కర్నూలు జిల్లా పాణ్యం మండల పరిధిలోని కౌలూరు గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

మరిన్ని వార్తలు