నోట్ల కట్టల మాయగాడు.. డొక్కు స్కూటర్‌.. పాత కార్లు! ఊరంతా షాక్‌

27 Dec, 2021 21:32 IST|Sakshi

యూపీ వ్యాపారి పీయూష్‌ జైన్‌ వ్యవహారం దేశం మొత్తం హాట్‌ టాపిక్‌గా మారింది.  కాన్పూర్‌లో అత్తరు బిజినెస్‌ చేసే పీయూష్‌ను వెయ్యి కోట్ల  పన్ను ఎగవేత కేసులో అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. అతని ఇంటి, ఆఫీసు బీరువాల్లో మూలుగుతున్న నోట్ల కట్టల్ని లెక్కించేందుకు దాదాపు నాలుగు రోజులు పట్టింది అధికారులకు!.


నాలుగు రోజుల తనిఖీల అనంతరం.. పీయూష్‌జైన్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోర్టులో అతన్ని హాజరుపర్చగా..  14 రోజుల కస్టడీ విధించింది కోర్టు. పీయూష్‌ జైన్‌ ఇల్లు, కార్యాలయాల్లో కేంద్ర ఏజెన్సీలు ఇటీవల సోదాల్లో కోట్ల రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి. కన్నౌజ్‌లోని అతని ఇల్లు, ఫ్యాక్టరీల నుంచి సుమారు 194 కోట్ల విలువైన కరెన్సీ, 23 కిలోల బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇక అతనిపై ప్రశ్నల వర్షం కురిపించేందుకు అహ్మదాబాద్‌ తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జీఎస్టీ యాక్ట్‌ సెక్షన్ 69 కింద పన్నుల ఎగవేత ఆరోపణలపై పీయూష్ జైన్‌ను అరెస్ట్ చేశారు.  డిసెంబరు 22 నుంచి నాలుగు రోజులపాటు పీయూష్ జైన్ సంబందిత ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరగడం విశేషం.

డొక్కు స్కూటర్‌.. 
పీయూష్ జైన్ కన్నౌజ్‌లో తిరిగినప్పుడు ఓ డొక్కు స్కూటర్‌ ఉపయోగించేవాడట. ఇంటి బయట ఓ క్వాలిస్‌, మారుతీ కార్లు మాత్రమే ఉన్నాయి. ఇంట్లో పని మనిషి లేదు. ఏడాదికో వాచ్‌మన్‌ను మార్చేవాడబు. నకిలీ ఇన్‌వాయిస్‌లు, ఇ-వే బిల్లులు లేకుండా వస్తువులను రవాణా చేసే వ్యక్తి ద్వారా సరుకులను పంపడానికి సంబంధించిన డబ్బు అయ్యి ఉంటుందని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే పీయూష్‌, కెమిస్ట్‌ అయిన తండ్రి నుంచి పర్‌ఫ్యూమ్‌లు తయారు చేయడం నేర్చుకున్నాడు. గత పదిహేనేళ్లలో వ్యాపారాన్ని విస్తరించాడు. ముంబై, గుజరాత్‌లో ఇప్పుడతని వ్యాపారం అద్భుతంగా నడుస్తోంది. ఈ దెబ్బతో జైన్‌, అతని సోదరుడు అంబరీష్‌ తమ ఇంటిని 700 స్క్వేర్‌ యార్డ్‌లో ఒక మాన్షన్‌లా మార్చేశారు. అయితే ఊళ్లో చూసేవాళ్లంతా అతను డొక్కు స్కూటర్‌ మీద వస్తుండడంతో సింప్లిసిటీగా భావించేవాళ్లట. తాజా పరిణామంతో వాళ్లంతా షాక్‌లో ఉన్నారు.

ఇక జైన్‌ ఇంట్లో, ఫ్యాక్టరీలో డబ్బు, నగలతో పాటు శాండల్‌వుడ్‌ ఆయిల్‌, కోట్లు విలువ చేసే పర్‌ఫ్యూమ్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు