చేతి పంపునుంచి నీటికి బదులుగా మద్యం: షాకైన పోలీసులు

7 Nov, 2023 19:13 IST|Sakshi

సాధారణంగా చేతి పంపు నుంచి నీరు రావడం అనేది అందరికీ తెలుసు. ఒక్కోసారి అవి మెరాయించడం కూడా నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే ఉన్నట్టుండి చేతి పంపు నుంచి నీళ్లకు బదులు మద్యం వస్తే ఎలా ఉంటుంది. ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీలో ఇలానే జరిగింది. చేతిపంపు నుంచి మద్యం వస్తుండటంతో తొలుత అందరూ షాక్‌కు గురయ్యారు. కానీ ఆ తరువాత  అసలు విషయం తెలిసి నోరెళ్ల బెట్టారు.  

మీడియా కథనం ప్రకారం  రాష్ట్రంలో  ఎక్సైజ్ శాఖ దాడులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక్కడ పెద్దఎత్తున మద్యం తయారు చేసి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖకు సమాచారం అందింది. అయితే ఎన్నిసార్లు  దాడులు నిర్వహించినా ఎక్సైజ్ బృందానికి ఏమీ దొరకలేదు. అయితే చేతి పంపు నుంచి నీటికి బదులుగా మద్యం వస్తోందన్న వార్త ఆ నోటా ఈ నోటా పోలీసులకు చేరింది. దీంతో రంగంలోకి  దిగిన ఎక్సైజ్ శాఖ పోలీసులు మద్యం స్మగ్లింగ్‌కు కొత్త ఫార్ములా  తెలుసుకుని షాక్‌ అయ్యారు. అధికారుల ముందే దాన్ని ఆపరేట్ చేయగా మద్యం బయటకు రావడంతో నిందితులపై కేసు నమోదు చేశారు.  లక్షల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

విషయం ఏమిటంటే  ఆ ప్రాంతానికి చెందిన ఓ మహిళ  పెద్ద ఎత్తున మద్యం తయారు చేసి విక్రయిస్తోంది. పట్టు బడతామనే భయంతో మద్యం ట్యాంక్‌ను భూమిలో పాతి పెట్టినట్టు సమాచారం. అందులోంచి  హ్యాండ్‌ పంపు ద్వారా మద్యాన్ని విక్రయిస్తోంది. చివరికి  విషయాన్ని గుర్తించిన ఎక్సైజ్ శాఖ  బుల్డోజర్లతో భూగర్భ ట్యాంకును ధ్వంసం చేసింది. ఝాన్సీలో ఇలాంటి ఘటన నమోదు కావడం ఇదే మొదటిసారికాదు. 2020 సెప్టెంబరులో వేలకొలదీ లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఇలాంటి సంఘటనే గతంలో మధ్య ప్రదేశ్‌లో  కూడా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు